
ఉద్యోగ భద్రత కల్పించాలి
● సీఎం హామీని నెరవేర్చాలి ● జిల్లాలో 450 మంది సర్వశిక్ష అభియాన్ సిబ్బంది ● అదనపు బాధ్యతలతో ఇబ్బందులు ● క్రమబద్ధీకరించి వేతనాలు పెంచాలి
మునిపల్లి(అందోల్): కాంట్రాక్టు పద్ధతిలో ఎస్‌ఎస్‌ఏ (సమగ్ర శిక్షణ అభియాన్) పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల తమ కొలువు ఎప్పుడు ఊడిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ నిర్వహణ కోసం ప్రతీ ఏటా తమ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోవడంతో ఒక సంవత్సరం ఉద్యోగం చేసేందుకు వీలుంటుంది. ఇదే ఆసరాగా చేసుకున్న ఉన్నతాధికారులు చెప్పిన ప్రతీ మాట వినడంతో పని భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ పరిధిలోనే సమగ్ర శిక్ష అభియాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులతో సమానంగా పూర్తిస్థాయిలో పని చేస్తున్నా వేతనం మాత్రం పెరగడం లేదని వాపోతున్నారు. ఉద్యోగ భద్రత, వేతన పెంపు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
85 పాఠశాల క్లస్టర్లలో...
85 పాఠశాల క్లస్టర్లకు గాను 107 మంది సీఆర్‌పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, మెసేంజర్లు, టీటీఐ (పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్) పని చేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు పాఠశాలలు, అదనపు తరగతి గదులు ఆన్‌లైన్‌లో విద్యార్థుల వివరాల నమోదు చేస్తారు. ప్రశ్నపత్రాల అందజేత, పాఠశాలల పరిశీలన, మధ్యాహ్న భోజన తనిఖీ, ఉపాధ్యాయులు, సెలవుల్లో ఉంటే వారి స్థానంలో విధులు నిర్వహించడం వంటి పనులు చేస్తుంటారు.
చాలీ చాలని వేతనాలతో...
ఎస్‌ఎస్‌ఏలో పనిచేసే వారికి తగిన వేతనం లేక నిత్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. 2021లో పీఆర్‌సీ ప్రకారం వీరికి రూ.19,500 వేతనం ఇస్తున్నారు. పీఎస్‌ఎస్‌ఎ (తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్) తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో హన్మకొండలో దీక్ష శిబిరానికి వచ్చి తాను అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సంగతిని వీరు గుర్తు చేస్తున్నారు. అయితే సీఎం ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని కోరుతూ 2024 నవంబర్‌లో 30 రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.