పాలన ఇక పారదర్శకం | - | Sakshi
Sakshi News home page

పాలన ఇక పారదర్శకం

Published Mon, Apr 28 2025 7:26 AM | Last Updated on Mon, Apr 28 2025 7:26 AM

పాలన

పాలన ఇక పారదర్శకం

● మేరీ పంచాయతీ యాప్‌తో సమగ్ర సమాచారం ● నిధులు, ఖర్చులతో పాటు పనుల వివరాలు ● అభివృద్ధి పనులకు ముందస్తు ప్రణాళికలు ● జిల్లాలో గ్రామ పంచాయతీలు 633

పంచాయతీ పూర్తి సమాచారం

గ్రామపంచాయతీకి సంబంధించి పూర్తి సమాచారం యాప్‌లో పొందుపరుస్తారు. యాప్‌లో ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామపంచాయతీలను ఎంచుకోవాలి. పంచాయతీకి సంబంధించిన పూర్తి అంశాలు కనిపిస్తాయి. పంచాయతీలో నివసిస్తున్న జనాభా, ఓటర్లు, నివాసం ఉంటున్న ఇండ్ల సంఖ్య, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, చేపట్టిన నిధుల ఆడిట్‌ వివరాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పూర్తి వివరాలు ఉంటాయి. ఈ యాప్‌లో మరిన్ని వివరాలు అప్‌డేట్‌ కానున్నాయి.

సంగారెడ్డి జోన్‌: మారుతున్న పోటీ ప్రపంచంలో కాలానికి అనుగుణంగా సాంకేతికతను వినియోగిస్తూ అభివృద్ధిపథం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ని 633 గ్రామపంచాయతీల సమగ్ర సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మేరీ పంచాయతీ యాప్‌’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్‌లో గ్రామ పంచాయతీల స్వరూపంతోపాటు అన్ని రకాల వివరాలు పొందుపరచనున్నారు. పంచాయతీకి సంబంధించిన అన్ని రకాల వివరాలను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఏ నిధులు ఎంత మేర ...

మేరీ పంచాయితీ యాప్‌ ద్వారా గ్రామ పంచాయతీ పాలకమండలి (సర్పంచ్‌ ఉప సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు), సంబంధిత పంచాయతీ కార్యదర్శి వివరాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు విడుదల చేసిన వివిధ రకాల నిధులు ఎంత మేర విడుదల చేశారు? విడుదల అయిన నిధులతో ఏయే రకాల పనులు చేపట్టారు? ఎంత మేర ఖర్చు పెట్టారు? అనే విషయాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులతోపాటు పంచాయతీ కార్మికులకు అందించిన వేతనాలు, తదితర ఖర్చుల వివరాలను పొందుపరచనున్నారు.

పనుల్లో తగ్గనున్న అవినీతి

గ్రామ పంచాయతీల్లో పారదర్శకత పాలను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే మేరీ పంచాయతీ యాప్‌ ద్వారా మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మంజూరైన నిధులతో చేపట్టిన పనులు, ఖర్చు చేసిన వాటి వివరాలు లభ్యమవుతాయి. ఖర్చు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయడంతో పాలనలో పారదర్శకత మెరుగు పడనుంది. దీంతో చేపట్టిన పనుల్లో నాణ్యతతో పాటు అవినీతికి పాల్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి ఏ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి? వాటిలో ఉన్న నిల్వలు అనే వివరాలు లభ్యమవుతాయి.

అభివృద్ధి పనులు యాప్‌లో నమోదు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు సంబంధించి సిద్ధం చేసిన ప్రణాళికలు సైతం అందుబాటులో ఉంటాయి. గ్రామ పంచాయతీలో ఏ పనులు చేపట్టబోతున్నారు? పంచాయతీ పరిధిలో ప్రతిపాదించిన పనుల వివరాలు, కేటాయించిన నిధుల వివరాలు తెలుసుకోవచ్చు. ఏడాది కాలానికి సంబంధించిన ఖర్చుల వివరాలను అంచనా వేసి ఈ యాప్‌లో నమోదు చేస్తారు.

పూర్తి వివరాలు తెలుసుకునే సౌకర్యం

మేరీ పంచాయతీ యాప్‌ ద్వారా పాలనలో పారదర్శకత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌ ఫోన్లలో యాప్‌ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పంచాయతీకి కేటాయించిన నిధులతో పాటు ఖర్చుల వివరాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులు వివరాలు అందుబాటులో ఉంటాయి.

–సాయిబాబా,

జిల్లా పంచాయతీ అధికారి, సంగారెడ్డి

పాలన ఇక పారదర్శకం 1
1/2

పాలన ఇక పారదర్శకం

పాలన ఇక పారదర్శకం 2
2/2

పాలన ఇక పారదర్శకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement