
గాలిపల్లి బడి.. ఘన చరిత్ర
● మహామహులను అందించిన పాఠశాల ● పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి చదివింది ఇక్కడే.. ● విద్యావేత్తలుగా ఎదిగిన విద్యార్థులు ఎందరో..
ఇల్లంతకుంట(మానకొండూర్): గాలిపల్లి పెద్దబడికి ఘనమైన చరిత్ర ఉంది. పోరాట యోధులను అందించిన పాఠశాల ఇది. విద్యావేత్తలను తీర్చిదిద్దిన సరస్వతీ నిలయం. 1964 వరకు 8వ గ్రేడ్ వరకు ఉన్న పాఠశాలను 1964 తర్వాత హెచ్‌ఎస్‌సీకి అప్‌గ్రేడ్ చేశారు. ఒకప్పుడు సిరిసిల్ల తాలూకాలో గంభీరావుపేట, సిరిసిల్ల, గాలిపల్లి గ్రామాల్లోనే హయ్యర్ సెకండరీ స్కూళ్లు ఉండేవి. గాలిపల్లి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు ఇక్కడికే వచ్చి చదువుకునేవారు. కమ్యూనిస్ట్ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి, ఆయన కొడుకులు బద్దం రామ్‌రెడ్డి, బద్దం లక్ష్మారెడ్డి ఇక్కడే ప్రాథమిక విద్య వరకు చదువుకున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులెందరో విద్యావేత్తలుగా.. ప్రభుత్వ అధికారులుగా ఎదిగారు. గాలిపల్లి హైస్కూల్ ఘన చరిత్ర తెలుసుకుందాం..
కమ్యూనిస్టు లీడర్.. బద్దం ఎల్లారెడ్డి
కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డి గాలిపల్లి స్కూల్‌లోనే ఓనమాలు దిద్దారు. ప్రాథమిక స్థాయి వరకు ఇక్కడే చదువుకున్నారు. అనంతరం కరీంనగర్, హైదరాబాద్‌లలో చదువుకున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. నిజాం, రజాకార్ల అరాచకాలకు ఎదురెడ్డి పోరాటం చేశారు.
డీఎస్పీ.. వెంకటరెడ్డి
గాలిపల్లి హైస్కూల్‌లో 6వ తరగతి వరకు చదువుకున్న వెంకటరెడ్డి డీఎస్పీగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మండలంలోని అల్లిపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ఇల్లంతకుంటలోని తన బావ ఇంటి నుంచి నిత్యం 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవారిమని గుర్తు చేసుకున్నారు. తాను చదువుకున్న రోజుల్లో తరగతిలో 25 మంది విద్యార్థులం ఉండేవారని వెంకటరెడ్డి తెలిపారు. గురువులు చక్కగా పాఠాలు బోధించేవారన్నారు. హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తూ 2005లో ఉద్యోగ విరమణ పొందారు.
ప్రిన్సిపాల్.. నారాయణరెడ్డి
మండలంలోని వంతడుపులకు చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి ఇదే బడిలో 9వ తరగతి వరకు చదువుకున్నారు. తమ తరగతిలో 30 మంది విద్యార్థులు ఉండేవారని తెలిపారు. వంతడుపుల నుంచి గాలిపల్లికి రావాలంటే మధ్యలో వాగు ఉండేదని.. వర్షాకాలంలో వాగు దాటేందుకు నానా కష్టాలు పడ్డామని గుర్తు చేసుకున్నారు. వాగు దాటరాని రోజు బడికి సెలవు ప్రకటించేవారని తెలిపారు. బెజ్జంకి జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. నారాయణరెడ్డి సోదరుడు సింగిరెడ్డి ఆనందరెడ్డి ఇక్కడే చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ పొందారు.

గాలిపల్లి బడి.. ఘన చరిత్ర

గాలిపల్లి బడి.. ఘన చరిత్ర

గాలిపల్లి బడి.. ఘన చరిత్ర