
సాక్షి, హైదరాబాద్: వరంగల్ రైతు డిక్లరేషన్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి, రైతు వర్గాల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం నెల రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ‘పల్లె పల్లెకు కాంగ్రెస్’పేరుతో నేతలు గ్రామాలకు వెళ్లి అక్కడ రైతు రచ్చబండలను ఏర్పాటు చేయనున్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు సంక్షేమ ప్రకటనల గురించి, టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర రైతాంగానికి జరిగిన నష్టాలను ప్రజలకు వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఎలాంటి మేలు చేస్తుందో కూడా చెప్పనున్నారు. నెల రోజుల పాటు నాయకులంతా పల్లెల్లోనే మకాం వేసే విధంగా నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా టూర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
విస్తృత కార్యవర్గ సమావేశంలో చర్చ
సోమవారం సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో వరంగల్ డిక్లరేషన్‌కు సంబంధించిన కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో టీపీసీసీ కార్యవర్గంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. పల్లె పల్లెకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, నేతల షెడ్యూల్ గురించి చర్చించారు. ఈ నెల 21న రాష్ట్రంలోని ప్రముఖుల గ్రామాలకు వెళ్లి అక్కడ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. అలాగే కుమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సురవరం ప్రతాపరెడ్డి లాంటి చరిత్రకారుల స్వగ్రామాలకు ముఖ్యనేతలు వెళ్లాలని నిర్ణయించారు.
రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ప్రారంభించాలి
రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఏఐసీసీ నిర్వహించిన చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలకు టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గం ఆమోదం తెలిపింది. అదే విధంగా భారత్ జోడో యాత్రలో భాగంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దేశ వ్యాప్త పాదయాత్రను తెలంగాణ నుంచే ప్రారంభించేలా రాహుల్‌గాంధీ ఆమోదం కోరుతూ తీర్మానించింది. తొలుత 100 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర జరిగేలా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. జనజాగరణ అభియాన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు, ఇతర అంశాలపై కూడా చర్చించారు.
ప్రతి రైతు తలుపూ తట్టాలి
రాష్ట్రంలోని 34,684 పోలింగ్ బూత్‌ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, గ్రామాలు, మండల స్థాయిలో కరపత్రాలు పంచడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి తలుపు తట్టి రైతు కుటుంబాలను కలవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న 12 వేల పైచిలుకు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 400 మంది ముఖ్య నేతలను గుర్తించారు. చిన్నా, పెద్దా సంబంధం లేకుండా ఈ నేతలందరూ కనీసం 30–40 గ్రామాలకు వెళ్లి రైతు డిక్లరేషన్‌ను వివరించాలని ఆదేశించారు. జూన్ 2న ప్రతి గ్రామంలో డప్పు చాటింపు ద్వారా ఈ డిక్లరేషన్ గురించి రైతుల్లో అవగాహన కల్పించాలని, మార్కెట్ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, రైతు బజార్లతో పాటు వైన్ షాపులు, కల్లు కాంపౌండులు, బెల్టు షాపులు, మందుబజార్ల దగ్గర కరపత్రాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.