
అహ్మదాబాద్: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో చేసిన అభివృద్ధి కారణంగానే ఆ రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరసగా రెండోసారి గెలవడం అత్యంత సంక్లిష్టంగా మారిన పరిస్థితుల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో నెగ్గిందంటే ప్రజాస్వామ్యానికున్న బలమే అందుకు కారణమన్నారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో వచ్చే డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం అహ్మదాబాద్‌లో లక్ష మంది ప్రతినిధులతో కూడిన ‘పంచాయతీ మహా సమ్మేళన్8లో మోదీ పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా అమృతోత్సవ్ జరుపుకుంటున్న వేళ మహాత్ముడి స్వప్నమైన గ్రామాల అభివృద్ధిని సాధ్యం చెయ్యాలని పంచాయతీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులకు లక్ష్యాలు నిర్దేశించినట్టు చెప్పుకొచ్చారు. గ్రామాలు స్వయంసమృద్ధి సాధిస్తేనే దేశం వృద్ధి బాటన పయనిస్తుందని చెప్పారు.
విమానాశ్రయం నుంచి 10 కి.మీ. రోడ్ షో
అంతకుముందు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి రాష్ట్ర బీజేపీ కార్యాలయం దాకా ప్రధాని రోడ్ షో నిర్వహించారు. పూలదండలతో అలంకరించిన ఓపెన్ కారులో 10 కి.మీ. దూరం ప్రయాణించారు. ప్రజలు రోడ్డుకిరువైపులా నిల్చొని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. కాషాయం రంగు తలపాగా ధరించిన మోదీ అందరికీ విజయ సంకేతం చూపిస్తూ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ముందుకు సాగారు. మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారంటూ ఆయన మద్దతుదారులు కీర్తించారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. రోడ్డు పక్కన తాత్కాలిక వేదికలపై కళాకారులు నృత్యాలు చేశారు.
#WATCH | PM Modi shows victory sign as he greets the crowd during roadshow in Ahmedabad, post BJP's win in Uttar Pradesh, Uttarakhand, Manipur and Goa. pic.twitter.com/ITcaNnXF4g
— ANI (@ANI) March 11, 2022