
సాక్షి, అమరావతి: మంత్రి పదవి కన్నా సీఎం వైఎస్ జగన్ ఇస్తున్న గౌరవమే తనకు ఎక్కువని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పేర్ని నాని తెలిపారు. మంత్రి పదవి పోయిందన్న బాధ తనకు లేదన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన పార్టీ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేల గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. వచ్చే నెల 2 నుంచి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తామన్నారు.
బాబు సీఎం కావాలని పవన్ పగటి కలలు
ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరికైనా మద్దతు ఇస్తామని పేర్ని నాని చెప్పారు. చంద్రబాబుకి పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు కాదని.. బానిస, బంటు అని తీవ్రంగా విమర్శించారు. పవన్‌కి రాజకీయాల్లో వావి వరసలు, సిద్ధాంతాలు లేవని ధ్వజమెత్తారు. బాబుపై చూపిస్తున్న ప్రేమ చిరంజీవి పట్ల చూపిస్తే బాగుండేదన్నారు. చిరంజీవికి, పవన్‌కి చాలా వ్యత్యాసం ఉందన్నారు. చిరంజీవి విలువలున్న వ్యక్తి అని కొనియాడారు. బాబు సీఎం కావాలని పవన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లోనూ జగన్‌కు బ్రహ్మరథం పడతారని తేల్చిచెప్పారు. తాము పొత్తుల గురించి ఆలోచించబోమని.. ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తామని పేర్ని నాని వివరించారు.
27న సీఎం అధ్యక్షతన కీలక సమావేశం
ఈ నెల 27న సీఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుందని పేర్ని నాని తెలిపారు. కొత్త మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో సీఎం భేటీ కానున్నారని చెప్పారు. పార్టీ మరింత బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారని వివరించారు.