Karnataka Elections 2023 Live Updates: Voting For 224 Assembly Seats Elections Begins - Sakshi
Sakshi News home page

Karnataka Assembly Election 2023: ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్‌.. చివరి దశ పోలింగ్‌పైనే ఉత్కంఠ

Published Wed, May 10 2023 6:51 AM

Karnataka Assembly Election 2023 Voting Live Updates - Sakshi

Live Updates:

►‍ ఈసారి కర్ణాటక ఓటరు ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ నెలకొంది. గత కొంతకాలంగా వరుసగా సెకండ్‌ ఛాన్స్‌ ఏపార్టీకి ఇవ్వలేదు కన్నడ ఓటర్లు. అయితే.. గత సంప్రదాయం ప్రకారమే ఈసారి ఎన్నికలతో ప్రభుత్వాన్ని మారుస్తారా? లేదంటే 38 ఏళ్ల సంప్రదాయాన్ని బద్దలు కొట్టి వరుసగా రెండోసారి అదే ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తారా?.. అనేది 13వ తేదీన కౌంటింగ్‌తో తేలనుంది. 

►‍ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. 2018లో నమోదు అయిన పోలింగ్‌ శాతం 72.13. ఇక ఈసారి ఎంత నమోదు అయ్యిందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. 

►‍ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అయితే.. ఆరు గంటలకే పోలింగ్‌ ముగిసినప్పటికీ.. క్యూ లైన్‌లో నిల్చున్న వాళ్లకు మాత్రం ఓటు వేయడానికి అధికారులు అనుమతి ఇస్తారు. చివరి దశలో రికార్డయ్యే పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.

►‍ సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ ముగియనుంది. అయితే, క్యూలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. 

►‍ కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటలదాకా జరగనుంది. కాబట్టి.. సాయంత్రం 6గం.30ని.. తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌ను వెల్లడించాలని ఈసీ ఆదేశించింది. దీంతో కన్నడనాటతో పాటు మొత్తం మీడియాలో అరగంట పాటు నిశ్శబ్ధం(సైలెన్స్‌ పీరియడ్‌) నెలకొనుంది. ఆ అరగంట కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన చర్చలు సైతం జరగకూడదని స్పష్టం చేసింది ఈసీ. 

►‍ మధ్యాహ్నం 3 గంటల వరకు 52.03 శాతం ఓటింగ్‌ నమోదు. 

►‍ నటుడు కిచ్చా సుదీప్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుదీప్‌ బెంగళూరులో ఓటు వేశారు. ఈ సందర్బంగా సుదీప్‌ మాట్లాడుతూ.. నేను సెలబ్రెటిగా ఇక్కడకు రాలేదు. భారతీయుడిగా ఇక్కడకు వచ్చాను. బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు. సమస్యలను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా ఓటు వేయాలన్నారు. 

►‍ ఓటు వేసిన మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ. ఆయన స్వగ్రామైన హసన్‌ జిల్లాలోని హరధనహల్లిలో దేవేగౌడ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదొక చిన్న గ్రామం. సర్వతోముఖాభివృద్ధి జరిగింది. ఆ ఘనత ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హెచ్‌డి రేవణ్ణకే దక్కాలి అని అన్నారు. 

►‍ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37.25 శాతం ఓటింగ్‌ నమోదు. 

►‍కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ తన సతీమణి, కాంగ్రెస్‌ నేత గీతా శివరాజ్‌ కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా ప్రముఖ కన్నడ నటుడు రవిచంద్రన్ కుమారులు మనోరంజన్, విక్రమ్ కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేశారు

►కర్ణాటక ఎన్నికల సందర్భంగా.. తన నియోజకవర్గంలో ఆటో నడిపిన డీకే శివ కుమార్‌.

► కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తన భార్య రాధాభాయితో కలిసి గుల్బర్గా పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

►కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.99% ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 

►కన్నడ నటుడు డాలీ ధనంజయ తన కుటుంబంతో కలిసి అర్సికెరెలోని కాలేనహళ్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

►‘కాంతార’ ఫేమ్‌, కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి ఓటు వేశారు. కర్ణాటక అత్యుత్తమ భవిష్యత్తు కోసం తాను ఓటేశానని..  ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు.

►బుధవారం రోజే పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు తమ కుటుంబంతో కలిసి మైసూరులోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

►కర్ణాటక ఎన్నికల్లో జేడీజేపీ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తమ కుటుంబ సమేతంగా ఓటు వేశారు. రామనగర పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► కన్నడ నటుడు ఉపేంద్ర బెంగుళూరులోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం:  కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌


ఆకట్టుకుంటున్న ‘సఖి పోలింగ్‌ కేంద్రాలు’
►మహిళా సాధికారతకు చిహ్నంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘సఖి బూత్‌’లను ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నికల అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా  ఏర్పాటైన 996 పోలింగ్‌ కేంద్రాల్లో మహిళా అధికారులు, సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తారు.

గ్యాస్‌ సిలిడర్‌కు పూజలు
►కర్ణాటక ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ వినూత్నంగా నిరసన చేపట్టింది. బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌కు పూజలు చేసి అగరబత్తీలు వెలిగించారు.


► కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప శివమొగ్గలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాజకీయాలను వీడను
► కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య ఓటేశారు. ఆయన మాట్లాడుతూ.. 130కి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని తెలిపారు. పనిచేసే పార్టీకి ఓటు వేయలని సూచించారు. ఈ ఎన్నికల్లో దేశ భవిష్యత్తు ఇమిడి ఉందన్నారు. ‘నేను రాజకీయాలను వీడను.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయను. ఇవే నా చివరి ఎన్నికలు’ అని అన్నారు.

► కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మీనా హెబ్బల్ నియోజకవర్గంలో ఓటు వేశారు.

► కర్ణాటక మాజీ సీఎం,  కాంగ్రెస్‌ అభ్యర్థిగా మారిన బీజేపీ తిరుగుబాటు నేత జగదీష్‌ శెట్టర్‌ హుబ్లీ ధార్వాడ్‌ సెంట్రల్‌ నియోజక వర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందన్నారు. అన్ని వయసు, వర్గాల వారు తమకు ఓటు వేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

►కర్ణాటకలో కాంగ్రెస్‌ తప్పక విజయం సాధిస్తుందని పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ భార్య ధీమా వ్యక్తం చేశారు. తన భర్త గెలుస్తారని వందశాతం నమ్మకం ఉందన్నారు. కేరళ స్టోరీ కర్ణాటకలో ఏమాత్రం ప్రభావం చూపలేదని అన్నారు. కాంగ్రెస్‌ ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు.

►కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 10 గంటల వరకు 13 శాతం ఓటింగ్‌ నమోదైంది.

►కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌  తన సొంత నియోజకవర్గం కనక్‌పురలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనతో పాటు  ఆయన సోదురడు కూడా ఉన్నారు.

►కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుబ్బలిలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

► ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులు బెంగళూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లంతా కచ్చితంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రభుత్వం చేసే పనులను విమర్శించడం లేదా అభినందించే హక్కు ఉంటుందని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

► కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షిమోగలో ఓటు వేయడానికి ముందు పూజలు జరిపి కుమారులిద్దరితో కలిసి ఓటు వేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు విజయేంద్ర భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

► కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుబ్లీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అంతకుముందు హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

► సీనియర్ సిటిజన్లకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్‌. రాష్ట్రంలో మొత్తం 12.15 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ 80 సంవత్సరాలు దాటిన వారు ఉండగా, 17 వేల మంది 100 సంవత్సరాలు పైబడిన వారున్నారు.

► 5.55 లక్షల మంది ఓటర్లు అంగవైకల్యం ఉన్నటువంటి వారు ఉన్నారు.

► కర్ణాటకలో 2.62 కోట్ల మంది పురుష ఓటర్లు, 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు తమ ఓటర్లున్నారు.

► ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరు శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేశారు.

► గాలి జనార్ధన్ రెడ్డి స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ (KRPP) ఉత్తర కర్ణాటకలో 47 స్థానాల్లో పోటీకి దిగింది. బళ్లారి పరిసర ప్రాంతాల్లో గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ కీలకంగా మారింది.

► బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి సతీమణి, బళ్లారి సిటీ నియోజకవర్గ కేఆర్‌పీపీ పార్టీ అభ్యర్థి గాలి లక్ష్మి అరుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► కర్ణాటక ఎన్నికల్లో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జయ నగర్ బీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమే ఓటు వేశారు.
 

► ఓటర్లు సులభంగా పోలింగ్‌ బూత్‌ను గుర్తించేలా ఈసీ ఏర్పాట్లు చేసింది. చునావనా (chunavana) మొబైల్ అప్లికేషన్ ద్వారా పోలింగ్ స్టేషన్లు గుర్తించేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

► ఎలక్షన్స్ సాఫీగా సాగేందుకు పోలింగ్ బూతుల వద్ద అన్ని రకాల భద్రత ఏర్పాట్లు  చేశామని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) మనోజ్ కుమార్ మీనా తెలిపారు.

► 38 రోజులపాటు ప్రధాన రాజకీయా పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ రాష్ట్రంలో ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. 

► కర్ణాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం భిన్న శైలిలో సాగింది. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో ఓటర్లను ఆకర్షించడానికి వారు చెరో మార్గం అనుసరించారు.

► శని, ఆదివారాల్లో అట్టహాసంగా మోదీ 30 కిలోమీటర్లకు పైగా భారీ రోడ్‌ షోలు నిర్వహిస్తే, రాహుల్‌ మాత్రం సామాన్యుడిలా అందరితోనూ కలిసిపోతూ ప్రచారం చేశారు. 

► మోదీ జేపీ నగర్‌ నుంచి మల్లేశ్వరం వరకు 26 కి.మీ. పొడవునా, న్యూ తిప్పసంద్ర రోడ్డు నుంచి ట్రినిటి సర్కిల్‌ దాకా 6.5 కి.మీ. మే చేసిన రోడ్‌ షోలకు జనం పోటెత్తారు.

► రాహుల్‌ మాత్రం ఆది, సోమవారాల్లో రాజధాని జనంలో కలిసిపోయి ప్రచారం చేశారు. ఫుడ్‌ డెలివరీ బోయ్‌తో పాటు అతని మోటార్‌ సైకిల్‌పై ప్రయాణించారు. 

► రాష్ట్రంలో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మనవిచేశారు. మొత్తం 5.3 కోట్లు ఓటర్లు అందరూ ఓటు వేయాలని ఆయన కోరారు. దేశ ఐటీ రాజధానిలో యువ, నగర ఓటర్లు ప్రజాప్రభుత్వ పండుగలో చురుకుగా పాల్గొనాలని, ఓటేసే వృద్ధులను స్ఫూర్తిగా తీసుకుని యువత కదలాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి వద్దే ఓటు వేసిన వృద్ధులు, దివ్యాంగులను అభినందించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల కోసం అన్ని సౌలభ్యాలను కల్పించామన్నారు.
(చదవండి: నువ్వా-నేనా! రాహుల్‌ అలా.. మోదీ ఇలా.. ప్రచారంలో ఎవరికి వారే భిన్న శైలి)


► బెంగళూరులో జిల్లా ఎన్నికల అధికారి, బీబీఎంపీ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు నగర జిల్లాలో మొత్తం 8,802 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా సుమారు 36 వేల మంది పోలింగ్‌ అధికారులను నియమించామని, అదనంగా 20 శాతం మంది సిబ్బందిని కేటాయించామని తెలిపారు.

► విధానసభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా మే 10వ తేదీ అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్ల సంచారాన్ని పొడిగించారు. బయ్యప్పనహళ్లి, కెంగేరి, నాగసంద్ర పట్టు సంస్థ, కృష్ణరాజపుర, వైట్‌ఫీల్డ్‌ మార్గంలో 12.5 గంటల వరకు రైళ్ల రాకపోకలు ఉంటాయి. మెజిస్టిక్‌ నుంచి ఆఖరి రైలు రాత్రి 12.35 గంటలకు బయ్యప్పనహళ్లి, కెంగేరి, నాగసంద్ర పట్టు సంస్థ వరకు ప్రయాణిస్తుంది.

► కాంగ్రెస్‌, బీజేపీ జేడీఎస్‌ మధ్యే ప్రధాన పోటీ. ముమ్మరంగా ప్రచారం చేసిన ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ. భారీ రోడ్‌ షోలతో జనంతో మమేకమైన నేతలు.

► 224 అసెంబ్లీ స్థానాలకు పోటీపడుతున్న 2,165 మంది అభ్యర్థులు.  కర్ణాటకలో మొత్తం 5.31 కోట్ల మంది ఓటర్లున్నారు.

► ఈనెల 13 న ఎన్నికలు ఫలితాలు వెలువడనున్నాయి.

సాక్షి, బెంగళూరు: దక్షిణాదిలో కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, ఇతరత్రా ఎన్నికల సామగ్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్‌ కొనసాగనుంది. సాయంత్రం 6 లోపల పోలింగ్ బూత్ దగ్గర క్యూలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు.

తెల్లవారుజామున 5.30 కు సిబ్బందిచే నమూనా పోలింగ్‌ జరిగింది. నమూనా పోలింగ్‌ సమయంలో ఏవైనా సమస్యలు ఉంటే సరిచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 776 సునిశిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక నిఘా పెట్టింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. 84,119 మంది పోలీసులను ఎన్నికల కమిషన్‌ ఎన్నికల విధుల్లోకి తీసుకుంది.
(చదవండి: దుఃఖాన్ని దిగమింగి బందోబస్తు విధులకు)

Advertisement
 
Advertisement
 
Advertisement