చేతిలో చతుర్ముఖం..

బీఆర్‌ఎస్, బీజేపీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చతుర్ముఖ వ్యూహంతో తెలంగాణను హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు.. పార్టీ బలంగా ఉన్న, బీఆర్‌ఎస్ బలహీనంగా ఉన్న సెగ్మెంట్లు.. మిగిలిన చోట్ల గెలుపు గుర్రాలు.. ఈ 4 ప్రధాన అంశాలు ప్రాతిపదికగా కసరత్తు చేస్తోంది.
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు సంబంధించి సునీల్ కనుగోలు టీం ఇచ్చిన నివేదికను పక్కాగా అమలు చేయడం ద్వారా తెలంగాణలో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా బరిలో నిలిచినా 2014 ఎన్నికల్లో 28 శాతం, తర్వాత 2018 ఎన్నికల్లో 26 శాతం మాత్రమే ఓట్లను మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్ అధికారానికి ఆమాడ దూరంలో నిలిచింది. అధికారంలోకి రావాలంటే 60 స్థానాల్లో గెలవాల్సి ఉండగా, 2014 ఎన్నికల్లో 21 చోట్ల, 2018లో 19 చోట్ల మాత్రమే గెలుపొందగలిగింది. ఈసారి మాత్రం 60కి పైగా స్థానాల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది.
ఆ 12 నియోజకవర్గాలపై ఫోకస్
2018లో గెలిచిన 19 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. రెండు స్థానాలను ఉప ఎన్నికల్లో (హుజూర్‌నగర్, మునుగోడు) కోల్పోయింది. దీంతో ఐదుగురు మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో హస్తం గుర్తుపై గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు సంబంధించిన 12 స్థానాల్లో ఈసారి కూడా ఎలాగైనా గెలుపొందేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే ఆయా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేయనుంది.
కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ద్వారా ఆయా ఎమ్మెల్యేలు పొందిన లబ్ధికి సంబంధించి సేకరించిన ఆధారాలను ప్రజల ముందుంచాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో పార్టీ పక్షాన ఇంప్లీడ్ కావడం ద్వారా.. పార్టీ మారిన 12 మందిపై సీబీఐ విచారణ జరిపించాలని చేస్తున్న డిమాండ్ కూడా, ఆయా స్థానాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంలో భాగమేనని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వారు పార్టీకి చేసిన మోసాన్ని ప్రజలకు వివరించడం ద్వారా సానుభూతిని పొందాలని పార్టీ భావిస్తోంది.
సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 25 సీట్లపై గురి
రాష్ట్రంలోని 30 వరకు నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచే బలం తమకుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో ప్రస్తుతమున్న సిట్టింగ్ స్థానాలైన మధిర, సంగారెడ్డి, ములుగు, మంథని, భద్రాచలంతో పాటు హుజూర్‌నగర్, కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, జగిత్యాల, కొడంగల్, నిర్మల్, నర్సంపేట, మహబూబాబాద్, సూర్యాపేట, ఇబ్రహీంపట్నం, మంచిర్యాల, బోధన్, కామారెడ్డి, వరంగల్ వెస్ట్, ఈస్ట్, జనగామ, కొత్తగూడెం, పినపాక, పరిగి, జడ్చర్ల తదితర స్థానాలను లెక్కగడుతోంది. ఈ స్థానాల్లో పార్టీ శ్రేణులను పూర్తిస్థాయిలో ఉత్తేజితం చేయడం ద్వారా పోలింగ్ బూత్, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో మరింత బలం పుంజుకునేలా చేయాలనే ఆలోచనలో ఉంది.
వారి బలహీనతే పార్టీకి బలం..
ముప్పై స్థానాలకు తోడు బీఆర్‌ఎస్ బలహీనంగా ఉన్న మరో 20 వరకు స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గుర్తించింది. ఆలేరు, పటాన్‌చెరు, అచ్చంపేట, స్టేషన్ ఘన్‌పూర్, పరకాల, కరీంనగర్, వేములవాడ, బెల్లంపల్లి, జుక్కల్, మానకొండూరు, డోర్నకల్, పాలేరు, అశ్వారావుపేట, తుంగతుర్తి, వికారాబాద్, మేడ్చల్, కంటోన్మెంట్ లాంటి చోట్ల అనేక కారణాలతో బీఆర్‌ఎస్ అనుకున్నంత బలంగా లేదని పార్టీ భావిస్తోంది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌లో ఉన్న గ్రూపు తగాదాలు, పార్టీ కేడర్‌లో నెలకొన్న నైరాశ్యం లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లనుంది. ఆయా స్థానాల్లో పరిస్థితులను తమకు అనుకూలంగా తిప్పుకునే దిశలో కార్యాచరణను రూపొందిస్తోంది.
ఇక్కడ ఎలాంటి ప్రయోగాలూ వద్దు!
ఇక తమకు అంతగా బలం లేని హైదరాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు రాజధాని శివార్లలోని రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే స్థానాలు, బీజేపీ కొంత బలంగా ఉన్న నియోజకవర్గాలు, ముఖ్యంగా అర్బన్ ప్రాంతాలు, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ తదితర జిల్లాల్లో అనుకూలంగా లేని చోట్ల దీటైన గెలుపు గుర్రాలను ఎంపిక చేయడమే ఉత్తమ మార్గమని సునీల్ కనుగోల్ టీం ఇచ్చిన నివేదిక వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో విజయం సాధించిగలిగిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని, అవసరమైతే ఎన్నారైలు, కొత్తవారికి టికెట్లివ్వాలని సూచించినట్లు సమాచారం. సామాజిక సమతుల్యత, ఇతర ప్రయోగాలు ఈ నియోజకవర్గాల్లో చేయవద్దని పేర్కొన్నట్టు సమాచారం.