ఏదైనా మాట్లాడితే.. నాపైనా దేశద్రోహం కేసు: బీజేపీ ఎమ్మెల్యే

BJP MLA In UP Says Afraid Of Sedition Charges If He Speaks Against State Govt - Sakshi

యూపీలో మరో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

కోవిడ్‌ విధానంపై యోగి ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి

సీతాపూర్‌/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం చేపడుతున్న కోవిడ్‌ నియంత్రణ చర్యలపై అధికార బీజేపీలోనే అసంతృప్తి పెల్లు బుకుతోంది. తాజాగా, ఆ పార్టీకి చెందిన సీతాపూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌ రాథోడ్‌ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘ఎమ్మెల్యేలుగా ఏం చేయగలం? ఏదైనా ఎక్కువగా మాట్లాడితే, దేశద్రోహం, రెచ్చ గొట్టడం ఆరోపణలపై మాపైనా కేసులు పెడతారు’ అని అంటున్నట్లుగా ఉన్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గత వారం సీతాపూర్‌లో ఐసీయూ సౌకర్యాలపై మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ ఎమ్మెల్యే అయినా ఇలా తన అభిప్రాయం చెప్పేందుకు ముందుకు వస్తారని అనుకుంటున్నారా అని కూడా ఆయన  ప్రశ్నించారు.

ప్రభుత్వం చెప్పేదంతా సరైందేనని భావించాలనీ, ప్రభుత్వం, యంత్రాంగం ఒకే నాణేనికి రెండు పార్శా్వలని వ్యంగ్యంగా అన్నారు. ఈ నెల 9న కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని సీఎం యోగికి లేఖ రాశారు. మరునాడే, అధికార పార్టీకే చెందిన జస్రానా ఎమ్మెల్యే రాంగోపాల్‌ కోవిడ్‌ బారిన పడిన తన భార్యకు ఆగ్రా ఆస్పత్రి సిబ్బంది మూడు గంటలపాటు బెడ్‌ కూడా కేటాయించలేదని ఆరోపణలు చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top