ఎన్నికల ‘బండి’పై కసరత్తు | BJP Leaders Bandi Sanjay Comments On Assembly elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల ‘బండి’పై కసరత్తు

Feb 12 2023 2:31 AM | Updated on Feb 12 2023 2:31 AM

BJP Leaders Bandi Sanjay Comments On Assembly elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయంగా సానుకూల పరిస్థితులున్నా ఇప్పటికీ బీజేపీ ఎన్నికల సన్నద్ధత, స్పీడ్‌ సరిపోవడం లేదని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. మరో 9 నెలల్లోపే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున రాష్ట్ర పార్టీ సంస్థాగతంగా మరింత ధృఢంగా తయారుకావడంతో పాటు పూర్తిస్థాయిలో ఎన్నికలకు సంసిద్ధం కావాలని స్పష్టం చేస్తోంది. అందు కోసం పార్టీని యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని ఆదేశించింది.  

రాష్ట్ర పదాధికారుల్లో చురుకుగా లేని వారిని, జిల్లా అధ్యక్షుల్లో క్రియాశీలకంగా లేని వారిని, నాయకత్వం ఇచ్చే ప్రోగ్రామ్స్‌ను మొక్కుబడిగా నిర్వహిస్తూ పనితీరు సరిగా లేని సగం మందికి పైగా ప్రక్షాళన చేయాలని సూచించింది. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటలకు పైగా రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో కూడిన కోర్‌ కమిటీతో బీజేపీ అగ్రనాయకుడు, కేంద్రహోంమంత్రి అమిత్‌షా భేటీ అయినప్పుడు ఈ అంశాలనే స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

గత సెప్టెంబర్‌ తర్వాత జరిగిన ఈ కోర్‌ కమిటీ సమావేశంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై, సీఎం కేసీఆర్‌ తీరుపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్ప డిందని, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించని పరిస్థితులు నెలకొన్న విషయం తమకు నివేది కల రూపంలో అందిందని షా స్పష్టంచేశారు.

ఆ స్థాయిలో ఎన్నికల తయారీ ఉందా?
బీఆర్‌ఎస్‌కు బీజేపీనే సరైన ప్రత్యామ్నాయం అని తాము భావిస్తున్నామని, మిషన్‌ 90లో భాగంగా 90 సీట్లు గెలుపొందే లక్ష్యంతో ముందుకు సాగాల్సి ఉండగా ఆ స్థాయిలో ఎన్నికల తయారీ కనిపించడం లేదని అమిత్‌ షా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో వెంటనే మార్పు తీసుకొచ్చేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక,  వ్యూహంతో ‘ఎన్నికల రోడ్‌మ్యాప్‌’ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

ఇందులో భాగంగా పార్టీపరంగా టీమ్‌ను సిద్ధం చేసుకుని ఇప్పటి నుంచే ఎన్నికల కదనరంగంలోకి దూకాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతోందనే లీకులు ఇటీవల ఎక్కువయ్యాయని ఒకనేత ప్రస్తావించగా, ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వెంటనే వాటిని ఎదుర్కొనేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని అమిత్‌షా సూచించారు.

ఇక శనివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్రముఖ్యనేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ విడివిడిగా సమావేశమై పార్టీ పరిస్థితి, ఎన్నికల నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై అభిప్రాయాలు తీసుకున్నారు.

ఎలక్షన్‌ టీమ్‌ తయారీలో బండి సంజయ్‌.!
ఇక తాజాగా చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో...వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పార్టీలో భారీగా మార్పు, చేర్పులు చేపట్టేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. సంస్థాగతంగా పార్టీకి 38 జిల్లాలు ఉండగా, వీటిలో సగానికి పైగా జిల్లా అధ్యక్షులు, అందులోని కమిటీ నాయకుల పనితీరు సరిగా లేదని నివేదికలు అందినట్టు తెలుస్తోంది. దీంతో దాదాపు 20–25 జిల్లాల అధ్యక్షులను మార్చే అవకాశాలున్నాయనే ఊహాగానాలు సాగుతున్నాయి.

ఇక మంత్రి శ్రీనివాస్‌ను పంజాబ్‌కు బదిలీ చేశాక రాష్ట్ర పార్టీకి సంస్థాగత ప్రధానకార్యదర్శి కూడా లేనందున, మరో ప్రధాన కార్యదర్శిని నియమించుకునే అవకాశముంది. అదే విధంగా పనిచేయని ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అధికారప్రతినిధులను కూడా మార్చాలనే అభిప్రాయంతో సంజయ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే బండిసంజయ్‌ అధ్యక్షుడిగా మూడేళ్ల  పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు.

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది మొదట్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఆయనకు అధ్యక్షుడిగా మరో ఏడాదిన్నర ఎక్స్‌టెన్షన్‌ రావడమనేది ఖాయంగా చెబుతున్నారు. అధికారికంగా ఈ పొడిగింపు వచ్చిన వెంటనే రాష్ట్ర పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టి ఎన్నికల బృందంతో ముందుకెళతారని పార్టీ వర్గాల సమాచారం.

అధ్యక్షుల మార్పుపై సంకేతాలు...
ఈ నెల 25 వరకు 119 అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించాల్సిన ప్రజా గోసా– బీజేపీ భరోసా స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్స్‌పై సునీల్‌ బన్సల్‌ సమీక్షించారు. ఉప్పల్, బెల్లంపల్లి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం సాగకపో వడంపై సీరియస్‌ అయ్యారు. ‘‘యూపీలో 9 జిల్లాల అధ్యక్షులను మార్చాము...ఆ తర్వాత అంతా సెట్‌ అయింది.

ఎలాంటి మొహమా టాలూ వద్దు.’’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యా నించినట్టు సమాచారం. స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్స్‌ ఆధారంగా జిల్లా అధ్యక్షుల పనితీరు సమీక్షించి, సరిగా పనిచేయని వారిని మార్చే అవకాశం ఉందంటూ ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement