సర్వకాలీనం, సార్వజనీనం భగవద్గీత
విజయనగరం: కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణపరమాత్ముడు కర్తవ్య నిర్వహణ గురించి అర్జునుడికి చేసిన హితబోధే భగవద్గీత అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీ సాయి సత్సంగ సేవా సంఘం వ్యవస్థాపకుడు ఉపద్రష్ట వరప్రసాద్ పేర్కొన్నారు. గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో కేఎల్‌పురంలో గల గీతాంజలి స్కూల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరప్రసాద్ మాట్లాడారు. భగవద్గీతలోని ప్రతి అక్షరం ఒక శక్తిమంతమైన బాణం అని, ప్రతి భావం అమూల్య సందేశం అని భగవద్గీత సర్వకాలికం, సార్వజనీనం అని అన్నారు. రచయిత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ జీవీఎన్ భూపతి మాట్లాడుతూ భగవద్గీత ధర్మయుద్ధానికి సంబంధించిన సందేశం మాత్రమే కాదు. మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలను అందించే జీవన శాస్త్రం అన్నారు. అందుకే భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథమేకాదు, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంపూర్ణ మార్గదర్శిని అని పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా పూసపాటి రేగకు చెందిన టేకుమళ్ల అమిత్ సాయి శశాంక్ భగవద్గీత లోని భక్తి యోగాన్ని అర్థవంతంగా భక్తిశ్రద్ధలతో చదివి వినిపించారు .ఈ సందర్భంగా ఉపద్రష్ట వరప్రసాద్, డాక్టర్ జీవీఎన్ భూపతి లను పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు, డైరెక్టర్ రాజేష్, ప్రిన్సిపాల్ మల్లికలతో కలిసి గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, సలహాదారు సుభద్రాదేవి, డిమ్స్ రాజు, గిరి తదితరులు పాల్గొన్నారు.


