టమాటా పంటను ధ్వంసం చేసిన ఏనుగులు
కొమరాడ: మండలంలోని కళ్లికోట గ్రామానికి చెందిన బొద్దిన నారాయణ, జాగన రామకృష్ణ సాగుచేసిన టమాటా పంటను ఏనుగులు మంగళవారం ధ్వంసం చేశాయి. పంట పొలంలో సంచరించడంతో మొత్తం పాడైందని, అటవీశాఖ అధికారులు స్పందించి పరిహారం అందజేయాలని రైతులు విజ్ఞప్తిచేశారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.
● జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి
గరుగుబిల్లి: రైస్‌మిల్లు యజమానులు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని సంతోషపురం రైతు సేవాకేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. మిల్లులో నిర్వహిస్తున్న ధాన్యం సేకరణ, ధాన్యం తరలింపు, నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా అందుకు బాధ్యులుపై చర్యలుంటాయన్నారు. రైతుల నుంచి మిల్లు యజమానులు, సిబ్బందిపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రైతులు తమ ధాన్యంను నిర్దేశించిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయాలు జరిగేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యంను దళారులకు విక్రయాలు చేయవద్దని సూచించారు. ప్రస్తుతం తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఎలాంటి అసౌకర్యంలేకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఏఓ జ్యోత్స్న ఉన్నారు.
మా భూములు సేకరించొద్దు
బాడంగి: ఆ భూములే మాకు జీవనాధారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పైపులైన్ నిర్మాణానికి భూములు ఇచ్చేదేలేదని భీమవరం, పాల్తేరు, ముగడ, పిండ్రంగివలస, వీరసాగరం, బాడంగి గ్రామాలకు చెందిన రైతులు తేల్చిచెప్పారు. భూ సేకరణ కోసం ఆయా గ్రామాల రైతులకు 3(1)నోటీసులను అధికారులు అందజేశారు. వారందరితో బాడంగి మండలపరిషత్ సమావేశ భవనంలో ప్రజావిచారణ పేరుతో మంగళవారం సమావేశమయ్యారు. రైతుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మా గ్రామాలు మీదుగా 18 కిలోమీటర్ల పొడవున 12 మీటర్ల వెడల్పున భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్పారు. పైపులైన్ కోసం భూములు ఇస్తే ధరలు పడిపోతాయని, అవసరానికి అమ్ముకోలేమని అభిప్రాయం తెలిపారు. దీనిపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుధాసాగర్ మాట్లాడుతూ పైపులైన్ వల్ల నష్టంకలగదని, 12 మీటర్ల వెడల్పులో 1.5 మీటర్ల లోతులో కంతకాలు తవ్వుతారని, 14 అంగుళాల అధునాతనమైన పైపులనే వాడుతారని చెప్పారు.
ఒక లైన్ కోసం అవకాశమిస్తే రెండోలైన్ వేయరని గ్రారంటీ ఏమిటని రైతులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తే ఇది భారత ప్రభుత్వం విశాఖ నుంచి రాయపూర్ వరకు పైప్‌లైన్ వేసేందుకు నిర్ణయించిందన్నారు. ప్రత్యేక అవసరంగా భూములు ఇవ్వకపోయినా తీసుకునే అవకాశంలేక పోలేదని ఎస్‌డీసీ చెప్పగా.. వీలైనంతవరకు మా జిరాయితీ భూములను తప్పించి వేరే ప్రదేశంనుంచి లైన్‌వేసుకునేలా చూడాలని అధికారులను కోరారు. సమావేశంలో హెచ్‌పీసీఎల్ చీఫ్‌ఇంజినీరు జి.కిశోర్, తహసీల్దార్ ఎన్.వరప్రసాద్, విశ్రాంత తహసీల్దార్ గిరడ అప్పలనాయుడు, వీరసాగరం, పిన్నవలస రైతులు పాల్గొన్నారు.
టమాటా పంటను ధ్వంసం చేసిన ఏనుగులు


