అరకొర నిధులు.. ఆందోళనలో ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

అరకొర నిధులు.. ఆందోళనలో ఉపాధ్యాయులు

Dec 3 2025 7:51 AM | Updated on Dec 3 2025 7:51 AM

అరకొర నిధులు.. ఆందోళనలో ఉపాధ్యాయులు

అరకొర నిధులు.. ఆందోళనలో ఉపాధ్యాయులు

ఘనంగా నిర్వహించాలి

కేటాయించిన నిధులు

1796

వీరఘట్టం: మన ఇంటిలో జరిగే ఓ శుభకార్యానికి షామియానా వేసి... మైక్‌సెట్‌ పెట్టి.. ఓ 30 మంది బంధుమిత్రులను పిలిచి వారికి అన్ని మర్యాదలు చేయాలంటే మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం సుమారు రూ.10 వేలు వరకు ఖర్చు అవుతుంది. అదే బంధువుల సంఖ్య పెరిగితే ఖర్చు రూ.వేల నుంచి రూ.లక్షలకు చేరుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. మరి అలాంటప్పుడు ప్రతి పాఠశాలలో ఈ నెల 5న నిర్వహించనున్న మెగా పేరెంట్‌–టీచర్‌ (పీటీఎం)3.0 మీటింగ్‌ను ఘనంగా నిర్వహించాలని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం అరకొర నిధుల కేటాయింపుపై అయ్యవార్లు పెదవివిరుస్తున్నారు. 30 మంది విద్యార్థులున్న పాఠశాలకు రూ.900 నిధులు కేటాయిస్తే ఎక్కడ సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టికాకుండా మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిధుల కోసం దాతల వద్ద చేయిచాచమని పరోక్షంగా అయ్యవార్లకు చంద్రబాబు సర్కారు సూచిస్తోందంటూ మండిపడుతున్నారు.

డబ్బులు లేకుండా పండగ ఎలా?

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 5న పీటీఎంను పండగలా నిర్వహించాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆహ్వానించి స్కూల్‌ ప్రగతిని చాటి చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రొగ్రెస్‌ను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం పీటీఎం నిర్వహణకు నిధులు చాలవని చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి....

ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో 3,386 సర్కారు బడులు ఉన్నాయి. ఇందులో విజయనగరం జిల్లాలో 1796, పార్వతీపురం మన్యం జిల్లాలో 1590 సర్కారు బడులు ఉన్నాయి. వీటిలో పీటీఎంల నిర్వహణకు విజయనగరం జిల్లాకు రూ.38,20,500లు, పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.25,12,800లు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం చెప్పిన ప్రకారం కార్యక్రమం చేయాలంటే ఈ నిధులు చాలవని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. నిధుల కేటాయింపును పెంచాలని కోరుతున్నారు.

నిధుల కేటాయింపు ఇలా...

పాఠశాలల్లో 0–30 మంది విద్యార్థులుంటే రూ.900, 31–100 మంది మధ్య విద్యార్థులున్న పాఠశాలకు రూ.2,250, 101–250 మధ్యన రూ.4,500, 251–1000 మంది విద్యార్థులుంటే రూ.6,750, వెయ్యి మంది విద్యార్థులు కంటే ఎక్కువ ఉండే పాఠశాలకు రూ.9 వేలు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు.

ఈనెల 5న పీటీఎంను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఉపాధ్యాయులు చేపట్టాల్సిన విధి, విధానాలను ఇప్పటికే తెలియజేశాం. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్నట్టు ఉత్తర్వులు కూడా వచ్చాయి. ఆ నిధులతో అందరి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి.

– బి.రాజ్‌కుమార్‌, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా

రూ.25,12,800

పైసలు విదల్చకుండా పండగ ఎలా..?

మెగా పేరెంట్‌ –టీచర్‌ డేకు నిధులు చాలవంటున్న ఉపాధ్యాయులు

పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement