‘అమృతం’లో ఆయువు తీసే నిర్లక్ష్యం!
గడువు దాటిన బాలామృతం
● అంగన్‌వాడీలకు కాలం చెల్లిన బాలామృతం పంపిణీ
● ఎప్పటి నుంచో ఇదే తంతు
● పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశంతో ఐసీడీఎస్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల నుంచి బాలామృతం ఉచితంగా అందజేస్తారు. దీనిని బాలలకు అమృతతుల్యంగా భావిస్తారు. బిడ్డకు పుష్టినిచ్చే ఈ బాలామృతం.. ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విషతుల్యమవుతోంది. మందులకై నా, తినే వస్తువులకై నా కాలపరిమితి ఉంటుంది. గడువు దాటిన తర్వాత వాటిని వినియోగించరాదని స్పష్టంగా చెబుతా రు. అటువంటిది చిన్నారులకు అందించే పౌష్టికాహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఐసీడీఎస్ అధికారుల తీరు ఇందుకు భిన్నం. పార్వతీపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పసిబిడ్డల ఆరోగ్యాన్ని పెంచాల్సిన పౌష్టికాహారం.. కాంట్రాక్టర్ల అలక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా దారి తప్పింది. గడువు తీరిన బాలామృతం ప్యాకెట్లను ప్రాజెక్టు పరిధిలో పంపిణీ చేయడం.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.
ఆరోగ్యానికా.. అనారోగ్యానికా?
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏడు నెలల పసికందు నుంచి మూడేళ్ల చిన్నారులకు బాలామృతం ఇస్తారు. రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ఒక లబ్ధిదారుకు 25 రోజులకోసారి అందిస్తారు. తెలంగాణ నుంచి కాంట్రాక్టర్ ద్వారా వీటిని సరఫరా చేస్తారు. జిల్లాలో 10 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1,475 ప్రధాన, 600 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. 7 నెలల నుంచి 36 నెలల మధ్య వయస్సున్న చిన్నారులు దాదాపు 27 వేల మంది ఉన్నారు. జిల్లాలో ఏటా 10 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. మన్యంలో ఎనిమీయాతో పాటు, రక్తహీనత సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పౌష్టికాహారలోపం వల్ల ఎత్తుకు తగ్గ బరువు, వయస్సుకు తగ్గ ఎత్తు ఉండడం లేదు. ప్రధానంగా గిరిజన, గ్రామీణ ప్రాంత చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారమే దిక్కవుతోంది. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం, అవినీతి కారణంగా చాలా వరకు పిల్లలకు అందించే పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. కాంట్రాక్టర్లతో కాసుల కక్కుర్తి కారణంగా చిన్నగుడ్లు సరఫరా చేయడం, కాలపరిమితి దాటిన సరకు లు అందజేయడం వంటి ఘటనలు తరచూ జిల్లా లో చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ నుంచి బాలామృతం ప్యాకెట్లు వస్తాయి. వీటిని గోదాముల్లో భద్రపరిచేటప్పుడు, కేంద్రాలకు తరలించేటప్పుడు కనీస తనిఖీలు చేపట్టాలి. ఇక్కడ ఆ విధమైన పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లతో లాలూచీ కారణంగా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పార్వతీపురం ప్రాజెక్టు పరిధిలో గత నవంబరులో వచ్చిన సుమారు 2,786 ప్యాకెట్లలో అధిక భాగం కాలం చెల్లినవే కావడం గమనార్హం. ప్యాకెట్లపై స్పష్టంగా 22/11 అని గడువు తేదీ ఉన్నప్పటికీ.. నేటికీ వాటిని కేంద్రాలకు సరఫరా చేసి వినియోగిస్తుండడం ఆ శాఖాధికారుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. పార్వతీపురం మండలంలో ఇప్పటికే బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు గత నెల 22 వరకు గడువు ఉన్న బాలామృతాన్ని తమ చిన్నారులకు అందించామని చెబుతున్నారు. పౌష్టికాహారం పేరుతో ప్రభుత్వం ఇస్తున్న ప్యాకెట్లను నమ్మి పిల్లలకు తినిపిస్తే.. రేపు ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కాలం చెల్లిన ఆహారాన్ని ఎలా పెడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన సీడీపీవో, సూపర్‌వైజర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. బస్తాల్లో ఉండటం వల్ల గడువు తేదీని గమనించలేకపోయామని గోదాము సిబ్బంది చెప్పుకురావడం గమనార్హం. దీనిపై సీడీపీవో రేఖావాణి వద్ద ప్రస్తావించగా.. పొరపాటు జరిగిందని, ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. గత నెల ఇచ్చిన ప్యాకెట్లను ఇంకా ఉంటే ఉపయోగించవద్దని, అలాగే, ఈనెల ఇచ్చే నిల్వలను ఫిబ్రవరి లేదా జూలై వరకు గడువు తేదీ ఉన్న స్టాక్‌ను సరఫరా చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలకు తెలియజేశామన్నారు.
‘అమృతం’లో ఆయువు తీసే నిర్లక్ష్యం!


