చంద్రన్నా.. ఐటీడీఏల వైపు చూడన్నా..! | - | Sakshi
Sakshi News home page

చంద్రన్నా.. ఐటీడీఏల వైపు చూడన్నా..!

Dec 4 2025 7:10 AM | Updated on Dec 4 2025 7:10 AM

చంద్రన్నా.. ఐటీడీఏల వైపు చూడన్నా..!

చంద్రన్నా.. ఐటీడీఏల వైపు చూడన్నా..!

చంద్రన్నా.. ఐటీడీఏల వైపు చూడన్నా..!

దిశానిర్దేశం లేని శాఖలు రెగ్యులర్‌ ఐటీడీఏ పీఓలు లేరు పాలకవర్గ సమావేశాలు లేవు

18 నెలలుగా కుంటుపడిన గిరిజానాభివృద్ధి

సీతంపేట ఐటీడీఏ

సీతంపేట:

పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రెండు ఐటీడీఏలకు రెగ్యులర్‌ ప్రాజెక్టు అధికారులను నియమించిన దాఖలా లేవు. శాఖలకు సరైన దిశానిర్దేశం లేదు. ఇన్‌చార్జిలతోనే ఐటీడీఏల పాలన కొనసాగుతోంది. సీతంపేటకు పాలకొండ సబ్‌కలెక్టర్‌, పార్వతీపురం ఐటీడీఏకు జేసీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. రెండు ఐటీడీఏల పరిధిలో 31 గిరిజన మండలాలు ఉన్నాయి. దాదాపు 1500లకు పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 16 గిరిజన సబ్‌ప్లాన్‌ మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. వివిధ శాఖలు నిర్వహిస్తున్నప్పటకీ పూర్తిస్థాయిలో అధికారులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని గిరిజనులు వాపోతున్నారు. సీతంపేట ఏటీడబ్ల్యూఓ పోస్టు ఖాళీగా ఉంది. ప్రాజెక్టు వ్యవసాయాధికారి పోస్టు బాధ్యతలను పీహెచ్‌ఓ నిర్వర్తిస్తున్నారు. గిరిజన సహకార సంస్థకు రెగ్యులర్‌ డివిజనల్‌ మేనేజర్‌ లేరు. జీసీసీ జనరల్‌ మేనేజర్‌ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఇంజినీరింగ్‌ శాఖలో డీఈ, ఏఈ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.

ఆశ్రమపాఠశాలల్లో హెల్త్‌వలంటీర్లు ఏరీ?...

గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలు 103 ఉన్నాయి. సుమారు 17 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వైద్యసేవలు అందించడానికి వీలుగా ఏఎన్‌ఎంలను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. హెల్త్‌వలంటీర్లు లేక అత్యవసర వైద్యసేవలు అందడంలేదు.

ఆశ్రమపాఠశాలల్లో ఆరోగ్యవలంటీర్లను నియమిస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులకు ఉద్యోగభద్రత కరువైనా పట్టించుకునేవారే లేరు.

ఆ శాఖల పరిస్థితి ఏంటి?..

సీతంపేట ఐటీడీఏలో ఏ శాఖ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని గిరిజన సంఘాల నాయకులు వాపోతున్నారు. ఇక్కడి ట్రైబల్‌వెల్ఫేర్‌ కార్యాలయం శ్రీకాకుళం తరలించేందుకు రంగం సిద్ధమైంది. మరో రెండు, మూడు నెలల్లో శ్రీకాకుళం కలెక్టరేట్‌లోని కొత్త ఆఫీస్‌కు తరలిపోనున్నట్టు తెలిసింది. వెలుగు కార్యాలయం ఇప్పటికే ఎత్తేశారు. నాలుగు నెలల కిందటే ట్రైబల్‌ ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ (టీపీఎంయూ)ను ఎత్తేశారు. అంతకముందు చిన్ననీటి వనరుల విభాగాన్ని తరలించేశారు. ఇలా.. ఒక్కో శాఖ కార్యాలయాన్ని ఎత్తేయడంతో సీతంపేట ఐటీడీఏ ఉంటుందా, ఊడుతుందా తెలియని పరిస్థితి నెలకొంది.

మౌలిక వసతులు నిల్‌...

గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు మృగ్యమయ్యాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీల మోత తప్పడం లేదు. ఉసిరికపాడు, దరబ, ఎగువద్వారబందం, కొండాడ తదితర ప్రాంతాలకు వెళ్లే గిరిజనుల అవస్థలు వర్ణణాతీతం. అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు తరలించాలన్నా, గిరిజన ఉత్పత్తులను మార్కెట్‌కు, సంతకు చేర్చాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. ఎండీయూ వాహనాల రద్దుతో బియ్యం కోసం కిలోమీటర్ల దూరంలోని డిపోలకు రావాల్సిన పరిస్థితి. చివరకు పాఠశాలలకు సైతం ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఇవ్వని దుస్థితి దాపురించింది. జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ స్పందించి గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement