పాఠశాల భోజన సరుకులు.. పక్కాదారి!
బియ్యంతో పాటు పప్పు, నూనె ప్యాకెట్లకు కూడా రెక్కలు అర్ధరాత్రి విద్యార్థులతోనే సరుకుల తరలింపు రావికోన ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసిన అక్రమాలు పాఠశాల హెచ్‌ఎంపై స్థానికుల ఆగ్రహం
పార్వతీపురం రూరల్: గిరిజన విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల కడుపుకొట్టి సరుకులను వారితోనే గుట్టుచప్పుడుగా తరలించేస్తున్నారు. మార్కెట్‌లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. బియ్యం మాత్రమే కాదు.. పప్పులు, నూనె ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులను సైతం పాఠశాల నుంచి అక్రమంగా దారిమళ్లిస్తున్న వ్యవహారం పార్వతీపురం మండలం రావికోన గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొద్దిరోజుల కిందట వార్డెన్ మృతి చెందడంతో ఆ బాధ్యతలను హెచ్‌ఎం నిర్వర్తిస్తున్నారు. అప్పటి నుంచి పాఠశాల వంట సామగ్రి గోదాంపై ఆయన ‘గుత్తాధిపత్యాన్ని’ ప్రదర్శిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. చదువుల క్షేత్రంలో అక్షరాలు నేర్పించాల్సిన హెచ్‌ఎం... వంట సిబ్బందితో కలిసి సరుకులు అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాల భోజన సరుకులు.. పక్కాదారి!


