చంద్రబాబు పర్యటనకు ఒక రోజు ముందుగానే భామినికి మంత్రి లోకేశ్ పాలకొండ నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో గ్రూపుల గోల వివాదాలను చల్లార్చి, పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులతో రహస్య సమావేశం!
సాక్షి, పార్వతీపురం మన్యం:
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆకస్మికంగా పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఒక్కరోజు ముందుగానే ఆయన ఇక్కడికి వస్తుండటం.. ప్రధానంగా పార్టీ శ్రేణులతో సమావేశం కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాలకొండ నియోజకవర్గంలో ఢీ అంటే ఢీ అనేలా కూటమి నాయకులు, కార్యకర్తల మధ్య ‘సఖ్యత’ ఉన్న విషయం విదితమే. ముఖ్యంగా టీడీపీలోనే వర్గవిభేదాలున్నాయి. సమయం దొరికినప్పుడల్లా అరుపులు, కేకలు, కొట్లాటలు.. పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణతో వీధికెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గం భామినిలో ఈ నెల 5వ తేదీన జరిగే మెగా పేరెంట్–టీచర్ మీట్‌లో పాల్గొనేందుకు చంద్రబాబు రావడం.. ఆయన ముందు ఎక్కడ రభస జరుగుతుందోనన్న భయంతోనే ఒక్క రోజు ముందుగా లోకేశ్ వస్తున్నారన్న చర్చ జిల్లాలో సాగుతోంది. పార్టీలోనూ, కూటమిలో అంతర్గత విభేదాలు పరిష్కారం కోసమే ఆయన ఆకస్మిక పర్యటనగా తెలుస్తోంది.
పాలకొండ నియోజకవర్గం టీడీపీలో ఆది నుంచి రెండు వర్గాలున్న విషయం విదితమే. సీనియర్ నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళావెంకటరావు వర్గాలుగా ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ(ఎన్నికలకు ముందు టికెట్ కోసమని జనసేనలోకి మారారు), టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి ముద్రపడ్డారు. గత ఎన్నికలకు ముందు టికెట్ కోసం పార్టీ మార్పులతో పెద్ద హైడ్రామానే నడిచింది. పొత్తులో భాగంగా ఇక్కడి సీటు జనసేనకు వెళ్లడం.. ఆ పార్టీకి సరైన అభ్యర్థి లేకపోవడం.. టీడీపీలో ఉన్న నిమ్మక జయకృష్ణ పవన్ కల్యాణ్ చెంతన చేరడం చకచకా జరిగిపోయాయి. పార్టీలు మారినంత సులువుగా ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మరింత ముదిరాయి. దీంతో అప్పటి నుంచి నియోజకవర్గంలో బద్ధశత్రువులుగానే వీరు మిగిలిపోయారు. నియోజకవర్గ టీడీపీ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ సమావేశాల్లోనూ, పెద్దలు వచ్చిన పలు సందర్భాల్లోనూ బాహాబాహీకి దిగిన పరిస్థితులున్నాయి. స్థానిక ఎమ్మెల్యేగా నిమ్మక జయకృష్ణ నుంచి ప్రభుత్వం తరఫున చేపట్టిన ఏ కార్యక్రమానికీ పడాల భూదేవి వర్గానికి పిలుపు ఉండదు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జయకృష్ణ నిర్వహించలేదు. భూదేవి తన వర్గంతో కొన్ని ప్రాంతాల్లో చేపట్టారు. ఇలా ఆధిపత్యం కోసం కొన్నాళ్లుగా ఇక్కడ అంతర్యుద్ధం సాగుతోంది. పలుమార్లు అధినేతల దృష్టికీ తీసుకెళ్లారు. మార్పులేదు.
ప్రస్తుతం చంద్రబాబునాయుడు పర్యటించనున్న భామిని నియోజకవర్గంలోనూ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. గ్రూపుల కారణంగానే కోఆపరేటివ్ సొసైటీలో నియామకాలు కాలేదు. ఇటీవల సొలికిరిలో టీడీపీలోని రెండు వర్గాలు బహిరంగంగా కొట్టుకున్నాయి. జయకృష్ణ, భూదేవి వర్గాలకు చెందిన ఆనందరావు, కొత్తకోట గోవిందరావులు తగాదాకు దిగారు. జయకృష్ణ బంధువర్గం భామినిలో ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ కాస్త ఆయనకు పట్టుంది. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య విభేదాలు ఎక్కువగా ఉంటున్నాయి. చంద్రబాబు పర్యటన ఇక్కడే ఉండటం.. ఆయన ఎదురుగా ఏదైనా రచ్చ జరిగితే పరువు పోతుందన్న భయంతోనే లోకేశ్ ముందుగా వస్తున్నట్లు టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇందుకోసం లివిరి వద్ద ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. 4వ తేదీన రాత్రి ఇక్కడే పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులతో చినబాబు సమావేశం అవుతారని తెలిసింది. ఇది పూర్తి అంతర్గత సమావేశామని కూటమి నాయకులు అంటున్నారు. పార్టీ సమావేశం తర్వాతనే ఈ నెల 5న భామిని మోడల్ స్కూల్‌లో మెగా పేరెంట్ డేలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి లోకేశ్ పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో పాటు.. సాలూరులో ఇటీవల మంత్రి అనధికార పీఏ, కుమారుడి వివాదం.. పార్వతీపురం నియోజకవర్గంలో గ్రూపుల గోల, కురుపాం నియోజకవర్గంలోనూ విభేదాలపై చినబాబు ‘క్లాస్’ తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
తీరనుందా అలక!


