మత్స్యకారులూ ఖబడ్దార్..!
మంత్రి, సబ్ కలెక్టర్ సాక్షిగా ఓ టీడీపీ నాయకుడు మత్స్యకారులకు బెదిరింపు
ప్రజాధనంతో కొనుగోలుచేసి
అందజేసిన చేప పిల్లలపై రాద్ధాంతం
మంత్రికి సారగస్వాగతం చెప్పకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక
మత్స్యకారులకు వచ్చిన ఆదాయంలో కోతపెడతామన్న నాయకుడు
నాయకుడి మాటలపై విస్తుపోయిన మత్స్యకారులు
సాలూరు రూరల్: టీడీపీకి చెందిన ఓ చోటా నాయకుడు మంత్రి, పార్వతీపురం సబ్ కలెక్టర్ సాక్షిగా మత్స్యకారులకు హెచ్చరికలు జారీచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రజాధనంతో కొనుగోలుచేసి రాయితీపై మత్స్యకారులకు అందజేసే చేపపిల్లల వ్యవహారాన్ని రాద్ధాంతం చేశారు. అధికారిక సభను రాజకీయ హెచ్చరిక సభగా మార్చేశారు. మౌతు పట్టుకుని మత్స్యకారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఏ నాడు టీడీపీకి ఓటేయరని తెలుసని... అయినా చేప పిల్లలు అందజేస్తున్నామని... ఈ సారి మంత్రి వచ్చేసమయంలో స్వాగతం పలుకకుంటే ఆదాయంలో కోతవేస్తామని, ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు మళ్లిస్తామంటూ అన్నంరాజువలసలో ఈ నెల 19న జరిగిన సభలో హెచ్చరికలు చేశారు. ఇప్పుడు ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మత్స్యకారుల సంక్షేమానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని, ఏ నాడూ చెప్పకోలేదని, ఇలాంటి హెచ్చరికలు చేయలేదంటూ మత్స్యకారులు చెబుతున్నారు. అధికారం ఉందన్న అహంకారంతో మత్స్యకారులపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబడుతున్నారు. వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని 426 గిరిజన మత్సకార కుటుంబాలు చేపల వేటే ఆధారంగా జీవిస్తున్నాయి. వీరిని ఆదుకునే అంశాలను, ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ప్రస్తావించాల్సిన సభలో... హెచ్చరికలు చేయడం... వాటిని మంత్రి ఖండించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడే ఉన్న సబ్ కలెక్టర్... టీడీపీ నాయకుడి వ్యాఖ్యలకు నిశ్చేష్టురాలయ్యారు. మౌ నంగా ఉండిపోయారు. తిరిగి ఐఏఎస్ అధికారిణికి కూడా మాటవినని మత్స్యకారులపై వేధింపు లు కొనసాగించాలంటూ సలహా ఇవ్వడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సారి మంత్రి వస్తున్నారని సమాచారం ఇస్తామని, 426 మత్సకారులు వారి కుటుంబాలతో సహా హాజరుకావాలంటూ హుకుం జారీ చేశారు. లేదంటే ఇంతవరకు లేని రూ ల్ మత్సకారులు చేపలువేట సాగించగా వచ్చిన ఆదాయంలో కొంత సొమ్మును ఇవ్యాలని రూల్ పెడతాం అని బెదిరింపులకు గురిచేసిన విషయం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.


