జాతీయస్థాయి కథలపోటీ బహుమతుల ప్రదానోత్సవం
విజయనగరం టౌన్: కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు స్మారక జాతీయస్థాయి కథల పోటీ 2025 బహుమతుల ప్రదానోత్సవం సోమవారం గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నిర్వహించారు. పోటీలకు జడ్జిలుగా సాహితీవేత్తలు మంజరి, పట్నాల ఈశ్వరరావు, వి.వెంకటరావులు వ్యవహరించారు. కథల పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథి జయంతి ప్రకాశ శర్మ, గౌరవ అతిథి నాలుగెస్సుల రాజు తదితరులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బెహరా వెంకట సుబ్బారావు ఔన్యత్యాన్ని, ఆయన రచనలలో గల ఉత్తరాంధ్ర యాస, మానవతావిలువలు, సామాజిక సమస్యల పట్ల వారి రచనల్లో ఇచ్చిన ప్రాముఖ్యతను వక్తలు కొనియాడారు. ఇటీవల విడుదలైన వారి పుస్తకం మధ్యతరగతి మందహాసంలోని 73 కథలు రెండు సీరియల్స్ గొప్పతనం అందరూ తమ సంభాషణలలో చెప్పారు. రచయిత కుమారుడు బెహరా సత్యనారాయణమూర్తి, కలిగొట్ల సన్యాసిరాజుల సౌజన్యంతో జిల్లా రచయితల సంఘం, విశాఖ సంస్కృతి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం కార్యదర్శి జీవీ.శ్రీనివాస్, అధ్యక్ష్యుడు కేకే.రఘునందన, సంయుక్త కార్యదర్శి గురుప్రసాద్, పప్పు భోగారావు , దాసరి పద్మ తదితరులు పాల్గొన్నారు.


