
బడి బస్సు భద్రమేనా ?
బడి బస్సుల భారం
పార్వతీపురంటౌన్: ప్రైవేట్ స్కూల్ విద్యలో ఇటు పుస్తకాలు, ఫీజుల మోతతో పాటూ బస్సు రవాణా మరింత బరువెక్కింది. ఏటా స్కూల్ ఫీజులు పెంచుతున్న విద్యాసంస్ధలు ఈ ఏడాది బస్సుల ఫీజులనూ వదల్లేదు. గతంలో పట్టణాలకు సమీపంలో రూరల్ గ్రామాలకు వెళ్లే బస్సుల్లో ఒక్కో విద్యార్థికి రూ.9వేలు, పట్టణ పరిధిలో రూ.7 వేలు వసూలు చేసేవారు. ఈ విద్యా సంవత్సరంలో రూరల్ గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు రూ.13వేలు, పట్టణ పరిధిలో విద్యార్థులకు రూ.10వేలుగా నిర్ణయించారు. చిన్నపాటి పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్ధులకు రూ. 13వేల నుంచి రూ.15 వేల వరకు ఫీజ వసూలు చేస్తుంటే బస్సు రవాణాకు మరో రూ.13వేలు వరకు వసూలు చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులకు బస్సు ట్రాన్స్‌పోర్టు భారంగా మారింది. ఇద్దరు పిల్లల స్కూల్ బస్సులకు చెల్లించే సోమ్ముతో పట్టణాల్లో మూడు నెలల పాటు ఇంటి అద్దె చెల్లించవచ్చుననే ఆలోచనలో విద్యార్ధుల తల్లిదండ్రులు ఉన్నారు. బస్సు భారంతో స్కూల్ విద్యలోనే తరగతి చదివించేందుకు భారీ మొత్తం అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సూమారు. 200 వరకు ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వాటిలో 58 వరకు బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 18,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. బస్సుల రవాణాకే ఏడాదికి లక్షల్లో చెల్లిస్తున్నారు. స్కూలు బస్సుల రవాణా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు వ్యాపారం..తల్లిదండ్రులకు భారంగా మారింది.
విజయనగరం టౌన్: పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు పూర్తికావచ్చాయి. గురువారం పూర్తిస్థాయిలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు తీసుకువెళ్లి వచ్చేందుకు గాను బస్సులు ముస్తాబవుతున్నాయి. అన్ని అనుమతి పత్రాలతో, ఫిట్‌నెస్‌ను సరిచూసుకుని బస్సు పనితీరు తదితర అంశాలపై స్కూల్ యాజమాన్యాలు, ఆర్‌టీఓ అధికారులు రంగం సిద్ధం చేశారు. స్కూల్ బస్సుకు సంబంధించి అన్ని రకాల సర్టిఫికెట్లు, ఫిట్‌నెస్ సక్రమంగా ఉంటేనే తిరగాలని, లేకుంటే కఠిన చర్యలకు వెనుకాడబోమని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బడిబస్సుల భద్రతకు సంబంధించి జిల్లా రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 15 ఏళ్లు దాటిన బస్సులకు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తమ స్కూల్ బస్సులో క్షేమంగా వెళ్లి, తిరిగి ఇంటికి చేరుకునేందుకు గాను బస్సుల ఫిట్‌నెస్‌ను అధికారులు ఎప్పటికప్పుడు పర్వేక్షిస్తున్నారు. ఫిట్‌నెస్ సక్రమంగా ఉంటేనే వాటికి అనుమతులిస్తున్నారు. జిల్లాలో 510 స్కూల్, కళాశాలల బస్సులు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు దాదాపు 400కి పైగా బస్సులు ఫిట్‌నెస్ పూర్తిచేసుకుని పాఠశాలలు, కళాశాలలకు విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. మరిన్ని బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలతో పాటూ ఇతర అనుమతి పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
బస్సు డ్రైవర్ ఎంపిక కీలకం
స్కూల్ బస్సు డ్రైవర్ల ఎంపికలో విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. శిక్షణ పొందిన, ఆరోగ్యంగా ఉన్న డ్రై వర్లకు ఎక్కువ వేతనం చెల్లించాలన్న కారణంగా 50 ఏళ్లు నిండిన వారిని ఎంపిక చేసుకుంటున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే డ్రైవర్ వయసు 50 ఏళ్లకు మించకూడదని, తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రై వర్ బీపీ, సుగర్ పరీక్షలు చేయించుకోవాలనే నిబంధనలు ఉన్నాయి.
యాజమాన్యాలదే బాధ్యత
జిల్లాలో సుమారు 510కి పైగా స్కూల్ బస్సులు ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. వాటిలో సుమారు 400 బస్సులకు ఇప్పటికే ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు పాటించని బస్సులను తిరస్కరించారు. మిగిలిన బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేస్తున్నారు. అయితే తిరస్కరణకు గురైన బస్సులను మళ్లీ పరీక్షలు చేయించుకోవడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని అధికారులు అంటున్నారు. స్కూల్స్ పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో బస్సు భద్రత తప్పనిసరి అని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులో సీట్లు, అద్దాలు, టైర్లు తదితర బస్సు సామగ్రి అన్నీ సక్రమంగా ఉనాయా? లేదా? అనేది చూసుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఫిట్‌నెస్ లేని బస్సులపై అధికారుల కొరడా
15 ఏళ్లు దాటిన బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు
జిల్లాలో 400 బస్సులు ఫిట్‌నెస్‌లో పాస్
మిగిలిన బస్సులకు పరీక్షలు చేస్తున్న అధికారులు
ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం
ప్రతి స్కూల్ బస్సుకు సంబంధిత పాఠశాల యాజమాన్యం తప్పనిసరిగా ఫిట్‌నెస్ చేయించాలి. లేకపోతే అటువంటి బస్సులను తిరగనిచ్చే ప్రసక్తే లేదు. పాఠశాల భద్రత విషయంలో రాజీపడేది లేదు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పాఠశాలలు తెరవనున్న నేపథ్యంలో ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకుని బస్సులు నడపాలి. పాఠశాలలు ప్రారంభం నాటి నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం. 15 ఏళ్లు దాటిన బస్సులు, 15 ఏళ్లకు దగ్గరగా ఉన్న బస్సులు తుక్కుగా అమ్మేసి వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దుచేసుకోవాలి. – మణికుమార్,
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, విజయనగరం

బడి బస్సు భద్రమేనా ?