కౌన్సెలింగ్ కోసం జెడ్పీ సమావేశ మందిరం ఆవరణలో నిరీక్షిస్తున్న ఉపాధ్యాయులు
‘మాన్యువల్’ కౌన్సెలింగ్‌కు తొలిరోజు సాంకేతిక ఆటంకాలు.. నేటికి వాయిదా
క్లస్టర్ వారీగా ఖాళీలు చూపాలంటూ ఉపాధ్యాయ ఐక్యవేదిక నిరసన
విజయనగరం అర్బన్: గురువుల తొలిరోజు నిరీక్షణ ఫలించలేదు. పోరాడి సాధించుకున్న మాన్యువల్ కౌన్సెలింగ్ కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరం వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేచి చూశారు. చివరకు సాంకేతిక కారణాలతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు ప్రకటించడంతో నిరాశతో వెనుదిరిగారు. ఉపాధ్యాయ సంఘాల ఉద్యమాలతో ఎస్‌జీటీల బదిలీల ప్రక్రియను మాన్యువల్ విధానంలో నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం మంగళవారం మధ్యాహ్నం బదిలీ కౌన్సెలింగ్‌కు సిద్ధమైంది. సీరియల్‌లో ఉన్న తొలి 400 మంది ఉపాధ్యాయులకు సమచారం ఇవ్వడంతో వారంతా జెడ్పీ సమావేశ మందిరం వద్దకు చేరుకున్నారు. పాఠశాలవిద్య కమిషన్ నుంచి కౌన్సెలింగ్‌కు సంబంధించి రావాల్సిన లింక్ రాకపోవడంతో వాయిదా వేశారు. బుధవారం నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిన ఉపాధ్యాయులకు సీరియల్ నంబర్ ప్రకారం సమాచారం పంపుతామని తెలిపారు.
నిరసన..
ఉమ్మడి విజయనగరంలో నూతనంగా ఏర్పడిన క్లస్టర్ కేంద్రాల్లో పోస్టుల ఖాళీలను చూపించకపోవడంపై ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు నిరసన తెలిపారు. తొలుత డీఈఓను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత ఖాళీలను ప్రస్తుతం చూపించాలన్న నిబంధనలు లేవని, బదిలీల ప్రక్రియ చివర్లో వాటిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని డీఈఓ వివరించారు. దీనిని వ్యతిరేకిస్తూ కౌన్సెలింగ్ ప్రాంగణంలోనే ఉపాధ్యాయులు నిరసనకు దిగారు.
అడ్డగోలు పదవికి మరో అవిశ్వాసం
బొబ్బిలి: వైఎస్సార్ సీపీకి ఉన్న ప్రజాదరణతో గెలుచుకున్న స్థానిక సంస్థలపై కూటమి నేతలు కన్నేసిన విషయం తెలిసిందే!. ఇటీవల బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పదవిని తమకు 10 మంది మాత్రమే కౌన్సిలర్లున్నప్పటికీ 20 మంది ఉన్న వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లలో కొందరిని ప్రలోభాలతో తిప్పుకున్నారు. చైర్మన్ గిరీని అడ్డగోలుగా పొంది సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు వైస్ చైర్మన్ పదవిని సైతం లాక్కునేందుకు సిద్ధపడ్డారు. వైస్ చైర్మన్ గొలగాని రమాదేవిపై ఆర్డీఓ జేవీఎస్‌ఎస్ రామమోహనరావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న అవిశ్వాస తీర్మానం సమావేశానికి ఇరు పార్టీలకు చెందిన కౌన్సిల్ సభ్యులు హాజరు కానున్నారు.


