సుఖీభవ లేక.. దుఃఖం దిగమింగలేక..! | - | Sakshi
Sakshi News home page

సుఖీభవ లేక.. దుఃఖం దిగమింగలేక..!

May 15 2025 12:51 AM | Updated on May 15 2025 12:51 AM

సుఖీభవ లేక.. దుఃఖం దిగమింగలేక..!

సుఖీభవ లేక.. దుఃఖం దిగమింగలేక..!

సుఖీభవ సాయం తక్షణమే వేయాలి

ఖరీఫ్‌ సీజన్‌ మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అన్నదాత సుఖీభవ సాయం తక్షణమే రైతుల అకౌంట్లలో జమచేయాలి. గతంలో మాదిరి సాగు పెట్టుబడికి సాయం అందజేయాలి. రైతుల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించాలి.

సీహెచ్‌.అప్పలనాయుడు, రైతు రెల్లివలస

డోలాయమానంలో అన్నదాతలు

పథకం మంజూరుకు పూర్తికాని వెరిఫికేషన్‌

మరో 15 రోజుల్లో ఖరీఫ్‌సాగు ప్రారంభం

సాగుకు అప్పుకోసం రైతన్న వెతుకులాట

పూసపాటిరేగ: రైతు సంక్షేమానికి పెద్దపీటవేస్తామని హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వం ఏడాదవుతున్నా ఇచ్చిన హామీని నెలబెట్టుకోవడంలో విఫలమమైంది. కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన పీఎం కిసాన్‌ నిధులు రైతుల అకౌంట్లలో ఇప్పటికే జమకాగా, రాష్ట్రం నుంచి అందజేయాల్సిన అన్నదాత సుఖీభవ మంజూరుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకంలో ప్రతి రైతుకు రూ.20 వేలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం జిల్లాలో 4,85,158 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 1,42,222 మంది రైతుల రికార్డులు మాత్రమే తనిఖీ అయ్యాయి. ఇంకా 3,42,936 మంది రికార్డుల వెరిఫికేషన్‌ పూర్తి చేసిన తరువాత వ్యవసాయ అధికారి లాగిన్‌లో వెరిఫికేషన్‌ పూర్తి చేశాక తుది జాబితా సిద్ధం కానుంది. ఈనెల 20 వతేదీ లోపు రికార్డుల వెరిఫికేషన్‌ పూర్తి చేయడానికి గడువు ఇచ్చినట్లు సమాచారం. రబీ సీజన్‌ దాదాపు పూర్తవడంతోమరో 15 రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. ఈసమయానికి గతంలో రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమఅయ్యేవి. నేటి పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. అన్నదాత సుఖీభవ కోసం జిల్లాలోని రైతులు ఎదురు చూస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఐదేళ్లు వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలోనే మార్గదర్శకాలను అనుసరించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం అకౌంట్లలో జమచేసి, ఎరువులు, విత్తనాలు రైతులకు రైతుభరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండేవి. వీటితో పాటు వైఎస్సార్‌ పంటల బీమా, పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు అందించే వారని, నేడు ఆ పరిస్థితి లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాయం ఎప్పుడు వేస్తారు..?

ప్రతి ఏడాది మే నెలలో వేయాల్సిన పెట్టుబడి సాయం రైతులకు ఎప్పడు వేస్తారు? అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా రైతులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. పెట్టుబడి సాయం కోసం ఇంకా వెరిఫికేషన్లు పూర్తికాని పరిస్థితి. అధికారులు సర్వేలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించి అన్నదాత సుఖీభవ ఖరీఫ్‌ సీజన్‌కు ముందే అందేవిధంగా చర్యలు తీసుకోవాలి.

కోరాడ వెంకటరమణ, రైతు పూసపాటిరేగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement