
రైల్వేశాఖ నిర్లక్ష్యం
● ఈ ఏడాదీ మామిడి ఎగుమతులు నిల్ ● కిసాన్ రైళ్లకు ప్రాధాన్యం కల్పించని అధికారులు ● అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేక.. ప్రత్యామ్నాయ మార్గాల వైపు రైతులు ● సాధారణ రైళ్ల కై నా... డిస్కౌంట్ లిచ్చి నడపని అధికారులు ● తూతూ మంత్రంగా ఎగుమతిదారులతో మంతనాలు ● నష్టాలబాట పట్టలేక రోడ్డు రవాణా వైపే రైతుల మొగ్గు
మేంగో అసోసియేషన్‌లతో సమావేశం నిర్వహించాం
ఈ ఏడాది మామిడి పంటను ఎగుమతులు చేసే విధంగా చూడాలని మేంగో అసోసియేషన్‌లతో సమావేశాన్ని నిర్వహించాం. అయితే పంట తక్కువ ఉందన్న కారణంగా వారంతా సుముఖత చూపించలేదు. పైగా కిసాన్ రైళ్లు, రాయితీలు కావాలని అడుగుతున్నారు. దీనిపైన ఉన్నతాధికారులకు నివేదించాం. జనరల్ బోగీలను ఇస్తామన్నాం. సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
– బి. వెంకట సత్యనారాయణ, చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్, విజయనగరం
అవసరం మేరకు అడిగాం
రైల్వేశాఖ ద్వారా ఏటా మామిడి ఎగుమతులు రాయితీపై పంపించేవారం. కిసాన్ రైళ్లను అందించలేదు. జనరల్ బోగీల ద్వారా ఎగుమతులు చేసేందుకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. రోడ్డు రవాణా ద్వారా మామిడి ఎగుమతులును నేరుగా స్టాక్ పాయింట్‌కే పంపించేస్తున్నాం. దీనివల్ల ఖర్చు తగ్గింది. రైల్వే అధికారులు కొంచెం ప్రాధాన్యం కల్పించి, రాయితీలు కల్పించి ఉంటే బాగుండేది.
– ముదునూరి నారాయణమూర్తి రాజు,
మేంగో అసోసియేషన్ ప్రతినిధి, విజయనగరం
విజయనగరం టౌన్: మామిడి ఎగుమతులనుద్దేశించి విజయనగరం ఖ్యాతిని దేశ ప్రధాని మోడీ ప్రస్తుతించిన సంగతి తెలిసిందే. అటువంటి మామిడి ఎగుమతులపై రైల్వేశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో గతేడాది ఎగుమతుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది కూడా పంట పూర్తయిపోయి, ఇతర మార్గాల గుండా వెళ్లిపోతున్నప్పటికీ అధికారులు ఏమాత్రం చలించకపోవడం గమనార్హం. సంబంధిత మేంగో అసోసియేషన్‌లతో తూతూమంత్రంగా సంప్రదింపులు చేసి వదిలేయడంతో వ్యాపారస్తులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టిసారించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏమాత్రమైనా వ్యాపారస్తులకు అవకాశం కల్పించి, రాయితీలిచ్చినట్లయితే ఈ ఏడాదైనా మామిడి పంట రైళ్ల ద్వారా వెళ్లేది. కానీ కేవలం నిర్లక్ష్యం కారణంగానే కోట్లాది రూపాయలను రైల్వేశాఖ నష్టపోయిందనడంలో అతిశయోక్తిలేదు.
ఏడాదికోమారు పండే మామిడి పంటను ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు రైల్వే ద్వారా ఎగుమతులు చేస్తూ ఎంతో కొంతమేర రైతులు లాభాన్ని చూద్దామనుకుంటుంటారు. అయితే చద్దన్నం కన్నా ఊరగాయ ఖర్చే ఎక్కువ అన్న చందాన ప్రస్తుతం రైతుల పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా మామిడి పంటను రైతన్నలు బుట్టలు కట్టి, ప్యాకింగ్‌లు చేసి రైల్వే ద్వారా ఇతర ప్రాంతాలకు పంపించే మేంగో అసోసి యేషన్‌కు అమ్మకాలు చేపట్టడమే కాకుండా దగ్గరుండి బుట్టలను రైలుపెట్టెల్లో సర్ది మరీ పంపిస్తుంటారు. అయితే గతేడాది కూడా రైల్వేశాఖ నిర్లక్ష్యం కారణంగానే మామిడి ఎగుమతుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి తలెత్తింది. కేవలం అధిక లభార్జానే ధ్యేయంగా రైల్వేశాఖ పనిచేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సాధారణ ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ల టికెట్ల ధరలను రైల్వేశాఖ పెంచేసింది. జనరల్ బోగీలతో పాటు స్లీపర్‌క్లాస్‌లను కుదించేసింది. ఏసీ భోగీలకు ప్రాధాన్యం కల్పించి సామాన్యుడి నడ్డి విరగ్గొట్టింది. మామిడి ఎగుమతులను కరోనా వంటి విపత్కర సమయంలోనూ కిసాన్ రైళ్లను ప్రవేశపెట్టి రైతులకు వెన్నుదన్నుగా నిలబడిన రైల్వేశాఖ కరోనా తర్వాత సగం ధరకే వచ్చే కిసాన్ రైళ్లకు స్వస్తిపలికింది. దీంతో సరైన పంటలేక, చాలీచాలని లోడ్‌లను వ్యాపారస్తులు నలుగురైదుగురు కలిసి రైళ్ల ద్వారా పంపిద్దామంటే కిసాన్ రైళ్లు లేకుండా పోయాయి. సాధారణ గూడ్స్ ద్వారా పంపిద్దామంటే నాలుగైదు బోగీలే తప్ప మిగతావన్నీ ఖాళీగానే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతి బోగీకి డబ్బులు చెల్లించాల్సిందే. దీంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. దానిమూలంగా ప్రత్యామ్నాయమార్గాలవైపు వ్యాపారులు దృష్టిసారించారు. ఉన్నతాధికారుల బాధ్యతా రాహిత్యం కారణంగానే రెండేళ్లుగా మామిడి ఎగుమతుల్లేకుండా పోయాయని పలువురు వ్యాపారస్తులు అభిప్రాయపడ్డారు.