
●నగరానికి చెందిన సిరాజ్ అరెస్టుతో ఉలిక్కిపడిన జిల్లా ●
విజయనగరం/విజయనగరం క్రైమ్:
విజయనగరం.. రాష్ట్రంలోనే సున్నితమైన, శాంతియుతమైన జిల్లా. కళలకు కాణాచి. సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం. వ్యవసాయమే అధికమంది జీవనాధారం. ఇలాంటి జిల్లాలో ఇప్పుడు ఉగ్రజాడ కలకలం రేపుతోంది. విశాఖపట్టణానికి చేరువగా ఉన్న విజయనగరాన్ని ఉగ్రకార్యకలాపాలకు అనువుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు జిల్లా వాసుల్లో భయాందోళన నింపుతున్నాయి. ఉగ్రభావజాలంతో కూడిన వ్యక్తిని ఇంటెలిజెన్స్ వర్గాలు అరెస్టు చేయడం, ఆయన వద్ద నుంచి బాంబుల తయారీకి వినియోగించే పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విజయనగరం ఉగ్రవాద చర్యలకు స్థావరంగా మారిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఆబాద్ వీధిలో భయంభయం..
విజయనగరం కార్పొరేషన్ నడిబొడ్డున ఉన్న ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ (28) ఉగ్రవాద భావజాలంతో పనిచేస్తున్నట్టు తెలంగాణా రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆయన ఇంటి పై శుక్రవారం రాత్రి దాడిచేసి అదుపులోకి తీసుకున్నాయి. రహస్యప్రదేశంలో విచారణ జరిపాయి. ఆయన వద్ద నుంచి బాంబుల తయారీలో వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఆయనను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌లోకి తీసుకున్నాయి. ఈ సమాచారంతో ఆబాద్‌వీధిలో నిశ్శబ్దం ఆవరించింది. స్థానికులు భయంభయంతో గడుపుతున్నారు.
గతంలో ఎన్నడూ చూడని విధంగా...
విజయనగరం జిల్లా చరిత్రలో గతంలో ఎప్పడూ బాంబు పేలుళ్లు, ముష్కర మూకలదాడులన్న మాటే లేదు. ఇప్పుడు అదే విజయనగరం సిరాజ్ అరెస్టుతో వార్తల్లోకెక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం నేరుగా విజయనగరం వచ్చి ఆబాద్‌వీధిలో బాంబులను తయారుచేసేందుకు వినియోగించే సోడియం సల్ఫర్, అమ్మొనియం పాస్ఫరేట్, అల్యూమినియం పౌడర్‌తో సిరాజ్‌ను అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. ఈ విషయం ఇక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించకపోవడం విస్మయం కలిగిస్తోంది.
దాడులు చేసేందుకేనా?
ఉమ్మడి ఏపీలో 2013లో హైదరాబాద్‌లో ఐఎస్‌ఐఎస్ సంబంధాలు కలిగిన యాసిన్ భత్కల్, సయ్యద్ షెహెన్ షా తదితర ఏడుగురు ఉగ్రవాదులు ఐసిస్ తో సంబంధం పెట్టుకుని ఏడుచోట్ల బాంబులు పేల్చి దాదాపు 20 మంది ప్రాణాలు తీశారు. ఇప్పటికీ ఇది మర్చిపోలేని మారణహోమం. ఇప్పుడు అలాంటి దాడికే విజయనగరం వేదికగా పథక రచన చేస్తూ సిరాజ్ పట్టుబడ్డాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కా ఆధారాలతో ఆబాద్‌వీధిలో ఉర్థూ పాఠశాల ఎదురుగానే నివసిస్తున్న సిరాజ్ ఇంట్లో సోదాలు చేపట్టి పేలుడుపదార్థాలు స్వాధీ నం చేసుకోవడం దీనికి బలం చేకూర్చుతోంది.
ఎవరికీ అనుమానం రాదనే...
హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు చేసి అల్లర్ల సృష్టించేందుకు సౌదీ అరేబియాలోని ఐఎస్‌ఐఎస్ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. వాస్తవానికి ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా ముందుగుండు సామగ్రి విక్రయాలకు పెట్టింది పేరు. ఇటువంటి వెనుకబడిన ప్రాంతంలో పేలుళ్లకు అవసరమైన పదార్థాలను సులభంగా సేకరించవచ్చని, నిఘా ఉండదని భావించారు. అందులో భాగంగానే సోడియం సల్ఫర్, అమ్మోనియం ఫాస్మరేట్ వంటి పదార్థాలు కొనుగోలుచేసి సిరాజ్ తన ఇంట్లో భద్రపరిచినట్టు తెలుస్తోంది. అయితే, నగరంలోని ఏ దుకాణంలో ఈ పేలుడు పదార్ధాలను ఎంత మొత్తంలో కొనుగోలు చేశారు...? వాటి తయారీతో ఎంత మొత్తంలో నష్టం చేకూర్చేందుకు పథకరచన చేశారన్న అంశాలపై నిఘా వర్గాలు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. తెలియని వ్యక్తులకు పేలుడు పదార్థాలు విక్రయిసున్నవారి వివరాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ఇంజినీరింగ్ విద్య నభ్యసించిన సమయంలోనే...
సిరాజ్ ఉర్ రెహ్మాన్ 2018 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన సమయంలో అక్కడ బోయగూడలో ఉంటున్న సమీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్టు నిఘావర్గాలు
గుర్తించాయి. ఇద్దరూ సౌదీఅరేబియాకు చెందిన ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు నెరిపినట్టు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న సమీర్‌ను పట్టుకోవడంతో విజయనగరంలో ఉన్న సిరాజ్ వ్యవహారం బయటపడింది. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులతో కార్డెన్ సెర్చ్, నాకాబందీ నిర్వహించిన పోలీసులకు సమీర్, సిరాజ్‌ల భాగోతం బహిర్గతమైంది. ఇద్దరూ కలిసి బాంబుల తయారీకి పథకరచన చేసినట్టు సమాచారం.
అదుపులోకి తీసుకున్నాం
ఇంటెలిజెన్స్ సమాచారంతో విజయనగరం ఆబాద్‌వీధిలో ఉగ్రవాద భావజాలంతో ఉన్న సిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నాం. అతనితో పాటు హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ను కూడా అక్కడి ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కృష్ణమూర్తితో కలిసి వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించాం.
– ఎం.శ్రీనివాస్, డీఎస్పీ, విజయనగరం
రక్షణ కుటుంబంలో చీడపురుగు..!
సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో ఏఎస్‌ఐగా, అన్న య ఆర్‌పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తి ఉగ్రభావజాలానికి ప్రేరేపితం కావడం చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి సిరాజ్‌కు విచ్చలవిడి తనం ఎక్కువ. తండ్రి మందలించినా పెడచెవిన పెట్టేవాడు. ఎప్పుడు ఇంటికి వస్తాడో.. వెళ్తాడో తెలియదు. మూడులాంతర్ల సమీపంలోని ఓ మొబైల్ షాపు యజమానికి దగ్గర బంధువుగా సిరాజ్‌ను పోలీసులు గుర్తించారు.

●నగరానికి చెందిన సిరాజ్ అరెస్టుతో ఉలిక్కిపడిన జిల్లా ●

●నగరానికి చెందిన సిరాజ్ అరెస్టుతో ఉలిక్కిపడిన జిల్లా ●