● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి
కల్యాణచక్రవర్తి
విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వంలోని మెలకువలను నేర్చుకోవడం ద్వారా కేసులను చాలా సులభంగా పరిష్కరించవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికల్యాణచక్రవర్తి అన్నారు. ఈ మేరకు సోమవారం 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నిర్వహించిన శిక్షణలో న్యాయవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మధ్యవర్తిత్వంలో భాగంగా శిక్షణ ఇవ్వడానికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రత్నతార, కేరళ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సిరాజ్ ఎంపికై న న్యాయవాదులకు శిక్షణ ఇస్తారన్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వ్యాజ్యాలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం రాబట్టాలని న్యాయవాదులకు సూచించారు. ఈ మధ్యవర్తిత్వం వల్ల ఉభయ పార్టీలకు సమయం డబ్బు వృథా కాకుండా ఉంటాయని, అదేవిధంగా కోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం చూపంవచ్చన్నారు. వ్యాజ్యాల పరిష్కారానికి రాజీ కూడా ఒక మార్గమేనని ఆయన స్పష్టం చేశారు. శిక్షణ పొందుతున్న ఉమ్మడి జిల్లాల న్యాయవాదులను శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణను అందిస్తున్న మాస్టర్ ట్రైనీస్‌తో మాట్లాడి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి బీహెచ్‌వీ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.


