
ఆవేదనలో విద్యార్థిలోకం
అందని స్టూడెంట్ కిట్లు..
● విద్యాసంవత్సరం ప్రారంభమై నెల దాటింది ● నేటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందని స్టూడెంట్ కిట్లు ● అరకొరగానే పాఠశాలలకు సరఫరా ● స్టూడెంట్ కిట్లు ఏవి ‘బాబూ’ అంటూ ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు
సాక్షి, పార్వతీపురం మన్యం:
ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులే అధికంగా చదువుతుంటారు. తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకునేలా శ్రమ పడు తూ మరీ తమ పిల్లలను బడికి పంపుతుంటారు. అటువంటి తల్లిదండ్రులకు విద్యాసంవత్సరం ఆరంభంలో తమ బిడ్డల చదువుకు అవసరమయ్యే పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రి కొనుగోలు చేయడం తలకు మించిన భారమే. వారిపై ఆ భారం పడకూడదనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న విద్యాకానుక పథకానికి రూపకల్పన చేశారు. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు పాఠ్య, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, బూట్లు తదితర సామగ్రితో కూడిన విద్యాకానుకను క్రమం తప్పకుండా పాఠశాలలు తెరవక ముందే సరఫరా చేసేవారు.
నేడు మారిన పరిస్థితి..
గత ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యాకానుక పథకం పేరునే స్టూడెంట్ కిట్‌గా ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం మార్చింది. వేసవి సెలవుల తర్వాత అన్ని పాఠశాలలూ జూన్ 13న పునఃప్రారంభమయ్యాయి. వెంటనే విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్‌లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కిట్‌లలో మూడు జతల యూనిఫాం క్లాత్, ఒక స్కూల్‌బ్యాగ్, బెల్టు, జతబూట్లు, రెండు జతల సాక్సులు, పాఠశాల విద్యాసంవత్సరం పుస్తకాలు, వర్క్‌బుక్స్ ఉంటాయి. అదనంగా 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నిఘంటువులను అందిస్తారు. ఒకటో తరగతి విద్యార్థులకు చిత్ర నిఘంటువు, 6వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులను ఇస్తారు. ఆదేశాలైతే ప్రభుత్వం ఇచ్చింది గానీ.. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా, స్టూడెంట్ కిట్‌లను నేటికీ పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోయింది. మరోవైపు యూనిట్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గత ప్రభుత్వంలో పెద్దపీట
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తరచూ చెబుతూ ఉండేవారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆ చదువులకు నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులు దూరం కాకూడదనే విద్యారంగంలో సమూల మార్పులు చేపట్టారు. మనబడి నాడు–నేడు కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలను మార్చారు. జగనన్న అమ్మఒడి, విద్యా, వసతి దీవెన వంటి వినూత్న కార్యక్రమాలతో పేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచారు. జిల్లాలో అమ్మఒడి పథకం కింద రూ.493 కోట్లు, విద్యాదీవెన కింద రూ.23.42 కోట్లు, వసతి దీవెన కింద రూ.15.84 కోట్లు ఖర్చు చేశారు. ఏటా క్రమం తప్పకుండా నిధులను విడుదల చేసి పిల్లల చదువుకు ఆటంకం లేకుండా చూసుకునేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి.. తల్లికి వందనంగా అమలు చేస్తామని చెప్పింది. విద్యాసంవత్సరం ప్రారంభమైనా నేటికీ ఏ ఒక్క తల్లుల ఖాతాలోనూ పథకం నిధులు జమ చేయలేదు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో..
పాఠశాలల పునఃప్రారంభం రోజునే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాకానుకలు అందేవి. పేద, మధ్యతరగతి పిల్లల చదువుకునేందుకు పుస్తకాలు లేవు, రాలేదు అన్న మాట ఎక్కడా వినిపించేది కాదు. విద్యాకానుకలు, అమ్మఒడి వంటి పథకాలు ప్రణాళికాబద్ధంగా అమలుచేయడంతో పాటు విద్యార్థుల ఉజ్వల భవితే లక్ష్యంగా విద్యాప్రణాళికలు పక్కాగా అమలయ్యేవి.
నేడు కూటమి ప్రభుత్వ పాలనలో...
పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు దాటింది. మొదటి యూనిట్ టెస్ట్ పరీక్ష దగ్గరపడుతోంది. ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పుస్తకాలు అందలేదు. విద్యాకానుకలకు స్టూడెంట్‌కిట్‌గా పేరుమార్చిన శ్రద్ధ పంపిణీలో ప్రభుత్వం చూపడంలేదు. 96,086 పుస్తకాలు, 1,880 నిఘంటువులు రావాల్సి ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. తల్లికి వందనం పథకం ప్రస్తావనే లేదు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
●అరకొరగానే సరఫరా
జిల్లాలో 1,584 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 91,856 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటివరకు విద్యార్థులకు 88,158 బ్యా గులు, 66,584 బెల్టులు, 91,805 జతల బూట్లు, 91,806 యూనిఫాంలు వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 7,01,067 పాఠ్యపుస్తకాలు, 5,07,872 నోట్ పుస్తకాలు వచ్చాయి. 96,086 వరకు పుస్తకాలు, 1,880 నిఘంటువులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. బ్యాగులు, బెల్టులు సైతం అవసరం మేరకు రాలేదు. దీంతో వచ్చిన వరకూ విద్యార్థులకు పంపిణీ చేసి, చేతులు దులుపు కొన్నారు. మిగతావి వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని చెబుతున్నారు.
●పూర్తిస్థాయిలో సరఫరా చేయాలి
విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటింది. ఇంకా కొన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో విద్యార్థి కిట్‌లను పంపిణీ చేయలేదు. దీనివల్ల విద్యార్థుల చదువు కుంటుపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే మేం కొన్ని స్కూళ్లలో పరిశీలించాం. అరొకరగానే సరఫరా ఉన్నట్లు గుర్తించాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్టూడెంట్ కిట్‌లను పూర్తిస్థాయిలో అందించాలి.
– పి.రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు,
ఎస్‌ఎఫ్‌ఐ

ఆవేదనలో విద్యార్థిలోకం

ఆవేదనలో విద్యార్థిలోకం