
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం అర్బన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలని కలెక్టర్ ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు. అట్రాసిటి చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులపై గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. మొత్తం 48 కేసులు నమోదు కాగా ఆయా డీఎస్పీల పరిధిలో ఉన్న కేసులపై సమీక్షించారు. పెండింగ్ కేసుల్లో సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ బాధితులకు తక్షణ పరిహారాన్ని అందించాలని స్పష్టం చేశారు. కేసుల్లో బాధితులకు బెదిరింపులు వస్తే, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జాతావు తెగకు చెందిన కేసుల్లో బాధితుల బాధ తెలుసుకునేందుకు భాషా అనువాదకులను నియమించి కోర్టుకు పంపించాలని చెప్పారు. కేసుల నమోదుకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్లను త్వరగా మంజూరు చేయాలన్నారు.
బాల్య వివాహాలు వద్దు
కమిటీ సభ్యులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ చదువు అవసరమని ఆడ పిల్లలను కూడా కనీసం డిగ్రీ వరకు చదివించేందుకు కృషి చేయాలని కోరారు. బాల్యవివాహాలు జరగకుండా చూడాలన్నారు. చిన్నతనంలోనే వివాహం చేస్తే వారి శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండదని అలాంటి స్థితిలో గర్భం దాల్చడం ఒక్కోసారి ప్రాణాంతకమవుతుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణులు, శిశువులను వైద్యం కోసం ఆర్‌ఎంపీ వైద్యులకు చూపించవద్దని స్పష్టం చేశారు. దీనివల్ల వ్యాధి ముదిరి తల్లీ పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. కమిటీ సభ్యులు సమావేశంలో ప్రస్తావించిన కొన్ని సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు మాట్లాడుతూ ఈ ఏడు నెలల కాలంలో 55 కేసుల్లో సుమారు రూ.1,10,50,000 పరిహారం కింద అందజేసినట్లు తెలిపారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.రత్నం, వివిధ శాఖల అధికారులు, డీఎస్పీలు, తహసీల్దార్‌లు, విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజలెన్స్ కమిటీ సమావేశంలో
సమస్యలపై చర్చ