
వైభవంగా ఆంజనేయ స్వామి శోభాయాత్ర
తెనాలి: హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక షరాఫ్‌బజార్‌లోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీహనుమజ్జయంతి మహోత్సవాలు ప్రారంభం కానున్నందున బుధవారం పట్టణంలో స్వామి వారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారిని కొలువుదీర్చి, పూజలు చేశారు. శ్రీపంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన బృందం, శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్టు సభ్యులు, భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని రామనామ స్మరణ చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22 నుండి జూన్ ఒకటో తేదీ వరకు వార్షిక శ్రీ హనుమజ్జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీహనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ప్రతి రోజు విశేష పూజలు, హోమాలు ఉంటాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కల్యాణం, 31న శ్రీ సువర్చలా హనుమత్ కల్యాణం ఉంటాయన్నారు. జూన్ ఒకటో తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనూరాధ, ట్రస్టు సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్రప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్ తదితరులు పాల్గొన్నారు.