
వీరాంజనేయునికి మామిడి ఫలార్చన
తెనాలి: పట్టణ మారీసుపేటలోని శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో గల వీరాంజనేయ స్వామికి ఈ నెల 22వ తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని లక్ష ప్రదక్షిణముల మహాయజ్ఞం కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఆరంభమైన కార్యక్రమంలో భాగంగా రోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు. భక్తులు తమ శక్తిని అనుసరించి ప్రదక్షిణములు చేస్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంలోనూ సామూహికంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్వామి వారికి మామిడి ఫలార్చన చేశారు. తదుపరి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగాయి. లలితా గోష్టి వారిచే హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. 22న హనుమజ్జంతి వేడుకను నిర్వహిస్తారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంధి సేతుమాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధరరావు, కోశాధికారి వరదా వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమ్మరాజు, తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు.
కిల్కారి కాల్ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని బుధవారం ఆర్మ్ సెంట్రల్ బృందం విజిట్ చేసింది. ఈ సందర్భంగా కిల్కారి కార్యక్రమం అమలు గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకుంది. పనితీరును అభినందించింది. అనంతరం సంగం జాగర్లమూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని బృంద సభ్యులు సందర్శించారు. ఆరోగ్యకేంద్రం స్థాయిలో కిల్కారి కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తల పని తీరుపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలతో ముచ్చటించారు. కిల్కారి కాల్ సర్వీస్‌ను కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రవేశం పెట్టినట్లు వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించటానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందని, 01244451660 అనే నంబర్ నుంచి కాల్ రావడం ద్వారా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, ఇన్‌చార్జి డీపీహెచ్‌ఎన్‌ఓ డాక్టర్ ప్రియాంక, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజు, డీసీఎం సురేష్ పాల్గొన్నారు.
17 మండలాల్లో తేలికపాటి వర్షం
కొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లావ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 17 మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా పొన్నూరు మండలంలో 8 మిల్లీ మీటర్లు నమోదుకాగా, అత్యల్పంగా తాడికొండ మండలంలో 0.8 మి.మీ. కురిసింది. సగటు వర్షపాతం 4.3 మి.మీ.గా నమోదైంది. మే నెల 21వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.2 మి.మీ కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ. కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. చేబ్రోలు మండలంలో 7.8, ప్రత్తిపాడు 6.6, గుంటూరు పశ్చిమ 6.2, కొల్లిపర 6.2, ఫిరంగిపురం 5.6, కాకుమాను 5.4, పెదనందిపాడు 5.4, తాడేపల్లి 5.4, మంగళగిరి 5.2, తెనాలి 4.4, దుగ్గిరాల 2.8, పెదకాకాని 2.2, గుంటూరు తూర్పు 2, మేడికొండూరు 1.8, తుళ్ళూరు మండలంలో 1.2 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది.

వీరాంజనేయునికి మామిడి ఫలార్చన