
చీకటి పువ్వు నాటికకు బహుమతుల పంట
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేటలో కళాకారుల ప్రతిభావేదికగా నిలిచిన తొమ్మిదో ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. చిలకలూరిపేట కళా పరిషత్, సీఆర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ మూడు రోజుల కళా ఉత్సవం 9 నాటికల ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించింది. భావోద్వేగాలకు మించిన రంగస్థల పోరాటాలు, సమకాలీన సమాజ సమస్యలపై ఆలోచనా త్మక సందేశాలు అందించిన ఈ నాటికలు కళాభిమానులను రంజింపజేశాయి. పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం కళాభిమానులు భారీగా తరలివచ్చి పండుగ వాతావరణాన్ని తలపింపజేశారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా కేవీ మంగారావు, జెట్టి హరిబాబు, సుమ పమిడిగంటి వ్యవహరించారు. బహుమతులు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయగా, కార్యక్రమానికి ఏవీ శివయ్య అధ్యక్షత వహించగా పరిషత్ అధ్యక్షుడు చెరుకూరి కాంతయ్య, సీఆర్ క్లబ్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు, కోశాధికారి మక్కెన నరసింహారావు, వేదిక అధ్యక్షులు డా. ముత్తవరపు సురేష్ బాబు, రోటరీ క్లబ్ గవర్నర్ నాగభైరు శ్రీనివాసరావు, బ్రహ్మానందం, కొత్త శివ, షేక్ షఫీ, ఆళ్ల హరిబాబు, మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నాయకులు షేక్ జమాల్‌బాషా, అంబటి బాలస్వామి, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ప్రదర్శనగా ‘చీకటి పువ్వు’
ఈ ప్రతిష్టాత్మక పోటీలో చైతన్య కళాభారతి(కరీంనగర్) వారి ‘చీకటి పువ్వు’నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై బహుమతిని సొంతం చేసుకుంది. అమృత లహరి థియేటర్ ఆర్ట్స్(గుంటూరు) వారి ‘నాన్న నేను వచ్చేస్తా’ నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలవగా, అమరావతి ఆర్ట్స్’(గుంటూరు) వారి ‘చిగురు మేఘం’ నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. కళాంజలి(హైదరాబాద్) వారి ‘రైతే రాజు’ నాటికకు జ్యూరీ ప్రదర్శనగా బహుమతి లభించింది.
వ్యక్తిగత విభాగాల్లో..
చీకటి పువ్వు నాటికకు సంబంధించి ఉత్తమ నటిగా లహరి, ఉత్తమ నటుడు కె.సత్యనారాయణ, ఉత్తమ దర్శకుడు మంచాల రమేష్, ఉత్తమ సంగీతం సురభి నాగరాజు, ప్రత్యేక బహుమతి ఏపూరి శ్రీనివాస్‌లు అందుకున్నారు. నాన్న నేను వచ్చేస్తా : ఉత్తమ క్యారెక్టర్ నటిగా అమృత వర్షిణి, ప్రత్యేక బహుమతి ఎస్.కే.హసన్ అందుకున్నారు. చిగురు మేఘం: ఉత్తమ విలన్ కె.సరిత, ఉత్తమ సహాయనటి బి.నాగరాణి, ప్రత్యేక బహుమతి ప్రసాద్. రైతే రాజు: ఉత్తమ రచన కంచర్ల సూర్యప్రకాశ్, ప్రత్యేక బహుమతి తిరుమల. దొందు దొందే: ఉత్తమ హాస్యనటుడు జబర్దస్త్ ప్రకాష్, ఉత్తమ ఆహార్యం కె.కుమారి, ప్రత్యేక బహుమతి కె.కుమారి. బ్రహ్మ స్వరూపం: ఉత్తమ రంగాలంకరణ పీవీ కుమార్, ప్రత్యేక బహుమతి వి.సి.హెచ్.కె. ప్రసాద్. ఇది రహదారికాదు నాటికకు ప్రత్యేక బహుమతిని చిరంజీవి దేవేష్ అందుకున్నారు.
ముగిసిన చిలకలూరిపేట కళాపరిషత్,
సీఆర్ క్లబ్ నాటికల పోటీలు

చీకటి పువ్వు నాటికకు బహుమతుల పంట