
నగలు చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్టు
చిలకలూరిపేట: బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన ఇరువురు నిందితులను చిలకలూరిపేట రూరల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణంలోని డైక్‌మెన్ కాలనీకి చెందిన పేదాల రాముడు, మదర్ థెరిస్సా కాలనీలో నివాసం ఉంటున్న బీరా సిద్దు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన యలగాల హనుమాయమ్మ ఈ నెల ఆరోతేదీన ఇంటికి తాళం వేసి సంతమాగులూరు మండలం, ఏల్చూరు గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి 11వ తేదీ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో పరిశీలించగా 42 సవర్ల బంగారు నగలు, 59.40 గ్రాముల వెండి వస్తువులు, రాగి బిందెలు, చెంబులు, ఇత్తడి సామగ్రి దొంగతనానికి గురైనట్లు గుర్తించి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వీటి విలువ సుమారు రూ. 34లక్షలు ఉంటుంది. రూరల్ సీఐ బి.సుబ్బనాయుడు, ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి నిందితులను చిన పసుమర్రు గొర్రెల మండి వద్ద అరెస్టు చేసి వారి నుంచి చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు అందిన వారంలోపు నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి నగలు స్వాధీనం చేసుకోవడంపై పోలీసు సిబ్బందికి డీఎస్పీ అభినందనలు తెలిపారు. సమావేశంలో ఏఎస్‌ఐలు డి.రోసిరాబు, జి.సుబ్బారావు, హెచ్‌సీలు కె.దేవరాజు, జె.శ్రీధర్, పీసీలు ఎం.యిర్మియా, బి.అశోక్, ఎం.రత్నకిషోర్ పాల్గొన్నారు.
రూ. 34లక్షలు విలువ చేసే వస్తువులు స్వాధీనం