
ఉద్యోగం ఇప్పిస్తామని రూ.8లక్షలు మోసం
నేను సత్తెనపల్లిటౌన్‌లో పాత బండ్లు కొనుగోలు, అమ్మకాలు వ్యాపారం చేస్తుంటాను. నా పెద్ద కుమారుడు సైదా బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేసి ఇంటి వద్ద ఖాళీగా ఉన్నాడు. ఆ సమయంలో మా షాపునకు ఎదురుగా చికెన్‌షాప్ నిర్వహిస్తున్న జ్యోతి ద్వారా కర్నూలుకు చెందిన తిరుమలేసురెడ్డితో పరిచయం ఏర్పడింది. అతను తనకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నాడని, తనకు తెలిసిన అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించాడని, నీ కుమారుడికి డిలైట్ కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైటెక్ సిటీ, హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. నాకు ప్రధానమంత్రి రుణం ఇప్పిస్తానంటూ నా వద్ద నుంచి రూ.8లక్షలు తీసుకున్నారు. నా కుమారుడికి ఉద్యోగం పేరుతో ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్ సెల్‌ఫోన్‌కు పంపించారు. దానిని తీసుకొని నా కుమారుడు సైదా కంపెనీ వద్దకు వెళ్లగా అవి ఫేక్ అని, ఆ కాగితాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని కంపెనీవారు చెప్పారు. దీంతో తమను వారిద్దరూ మోసం చేశారని గ్రహించి, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా నాపై దాడిచేశారు. వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి. –షేక్ యలవర్తిపాటి బాజీ, ములకలూరు, నరసరావుపేట మండలం
వరకట్నం కోసం
వేధిస్తున్నారు
నాకు అచ్చంపేట గ్రామానికి చెందిన వేపూరి వెంకటేశ్వర్లుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి నా భర్త, అత్త వరకట్నం తీసుకురావలసిందిగా పలుమార్లు వేధిస్తున్నారు. నా భర్త చీటికీమాటికి కొడుతూ ఉండటంతో నేను తల్లి ఇంటి వద్ద ఉంటున్నాను. నన్ను శారీరకంగా, మానసికంగా హింసిస్తూ కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి.
–ఓ మహిళ,
పాతగణేశుని పాడు, పిడుగురాళ్ల మండలం
●