
సందేశాత్మకం.. హాస్యభరితం
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: మనిషికి ప్రాణం ఎలాగో.. జీవితంలోనూ కళలు అంతే ముఖ్యమని..సంస్కృతి, సంప్రదాయాలకు అవే మూలమని డాక్టర్ చెరుకూరి తేజస్వి చెప్పారు. చిలకలూరిపేట కళాపరిషత్, సీఆర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఉభయ తెలుగురాష్ట్రాల స్థాయి 9వ ఆహ్వాన నాటికల ముగింపు పోటీలను ఆదివారం ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక సీఆర్ క్లబ్ ఆవరణలో స్వర్గీయ నాగభైరు సుబ్బారావు కళా ప్రాంగణంలో మూడోరోజు ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి భారీవర్షం కారణంగా చివరి ప్రదర్శన దొందు–దొందే నాటిక నిలిచిపోగా, దాన్ని మరుసటి రోజు తొలి ప్రదర్శనగా వేశారు. దీంతో ముగింపురోజు నాలుగు ప్రదర్శనలు అయ్యాయి. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు చెరుకూరి కాంతయ్య, క్లబ్ కోశాధికారి మక్కెన నరసింహారావు, ప్రజానాట్యమండలి నాయకుడు నూతలపాటి కాళిదాసు, బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత ఉద్యోగి ఏవీ శివయ్య, ఆళ్ల హరిబాబు, కొత్త శివ, కేవీ మంగారావు, సత్యానందం, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
నవ్వించిన ‘దొందూ–దొందే’
లోపం లేని వాడు లోకంలోనే లేడని మనలోని లోపాల్ని కాదు ప్రేమను పంచినపుడే జీవితం సంతోషంగా ఉంటుందని చాటింది భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి ‘దొందు–దొందే’ నాటిక. భారీపొట్టతో 40 ఏళ్లుదాటినా సంబంధాలు రాని ఓ యువకుడు తన లోపాన్ని పెళ్లికి ముందే భాగస్వామికి తెలియజేయాలని కుటుంబ సభ్యులతో చెబుతాడు. రేచీకటి ఉన్న యువతి తో అసలు విషయం చెప్పకుండా పెద్దలు వైభ వంగా వివాహం చేస్తారు. తొలిరాత్రి విషయం బహిర్గతం కావడంతో నూతన దంపతులు మధ్య మనస్పర్థలు ఏర్పడి విడాకుల కావాలంటారు. ఇరు కుటుంబాల్లో గందరగోళం మొదలవుతుంది. మనిషిలోని లోపాల్ని బలహీనతలుగా కాక, సహనం, ప్రేమతో చూసినపుడే జీవితాన్ని సాఫీగా ముందుకు సాగించడం సాధ్యమ వుతుందని తెలిపే సందేశంతో నాటిక ముగుస్తుంది. స్వీయరచనకు డేవిడ్‌రాజు దర్శకత్వం వహించారు.
●అదేవిధంగా కార్పొరేట్ హాస్పటళ్ల ధనార్జనపై అమరావతి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చిగురు మేఘం’, పాశ్చాత్య మోజుతో భారతీయ సంస్కృతిని వీడకు అనే సందేశంతో ది అమోచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్ వారి ‘ఆలీతో సరదాగా’, అతి గారాబం వల్ల కలిగే కష్టనష్టాలపై గుంటూరు అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘నాన్న నేనొచ్చేస్తా’ నాటికలు అలరించాయి.
ముగిసిన తెలుగు రాష్ట్రాలస్థాయి
ఆహ్వాన నాటికల పోటీలు

సందేశాత్మకం.. హాస్యభరితం