
కల్యాణ వైభోగమే..!
తెనాలిటౌన్: శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహారణ, ఎదురుకోలోత్సవం వంటి కార్యక్రమాలను దేవస్థాన అర్చకులు నిర్వహించారు. అదే విధంగా సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం వైభోవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వైకుంఠవాసుని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. కల్యాణ మహోత్సవానికి శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం సభ్యులు స్థానిక షరాఫ్‌బజార్‌లోని శ్రీ భావాన్నాఋషి స్వామి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకుని వేడుకగా తరలివచ్చి వైకుంఠపురంలో స్వామివారికి సమర్పించారు. ముత్తయిదువులు, పద్మశాలీయ సంఘీయులు వేడుకలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ మంతెన అనుపమ పర్యవేక్షించారు. కల్యాణ మహోత్సవంలో డబుల్‌హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల శ్యామ్‌ప్రసాద్, పలువురు పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

కల్యాణ వైభోగమే..!