
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం
తెనాలి అర్బన్: ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంటే బ్యానర్లు పెట్టుకుని రోడ్లపై తిరగడం కాదని, ఉద్యోగులంతా ప్రజలకు మెరుగైన సేవలందించడమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని శనివారం ఉదయం శివాజీ చౌక్ నుంచి మార్కెట్ వరకు నిర్వహించారు. పలువురు సచివాలయ ఉద్యోగులు తమకు నూతన పింఛన్లు, రేషన్‌కార్డులపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తప్పనిసరిగా వారానికి ఒకసారి ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. మురుగు కాల్వలు అధ్వానంగా ఉండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పలువురు కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, వారందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహా, మున్సిపల్ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, ఆరోగ్యాధికారిణి డాక్టర్ కె.హెలెన్ నిర్మల, హౌసింగ్ ఈఈ భాస్కర్, పెద్దసంఖ్యలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్