
కూటమి ప్రభుత్వ ‘మెడి’కిల్
తెనాలి: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైద్య సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసింది. పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. అద్దె భవనాల్లో నడుస్తున్న సెంటర్లకు శాశ్వత భవనాలు నిర్మిస్తూ వచ్చింది. పనులు చాలా వరకు పూర్తికాగా, అక్కడక్కడా తుది దశలో ఉన్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, కూటమి ప్రభుత్వం వచ్చాక పనుల్ని ఆపేసింది. అందుబాటులోకి తెచ్చేందుకు పూనుకోవడం లేదు.
ప్రజల చెంతకు వైద్య సేవలు
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజలు నివసించే ప్రాంతంలోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అప్పటికే పట్టణ ముత్యంశెట్టిపాలెంలో నడుస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్‌కు అదనంగా అయితానగర్, సుల్తానాబాద్, కొత్తపేట, మారీసుపేట, పాండురంగపేటలో ఏర్పాటుచేసింది. ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంది, అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి, సత్వరమే రోగుల సేవల్ని ఆరంభించింది. ప్రత్యేకంగా లేబరేటరీని కూడా సమకూర్చింది. ప్రతి పట్టణ ఆరోగ్యకేంద్రంలో 60 రకాల వైద్య పరీక్షలకు అవకాశం కల్పించింది. వివిధ వ్యాధులకు మొత్తం 178 రకాల మందులను అందుబాటులో ఉంచింది. దీనితో తెనాలి ప్రజలకు ప్రతి చిన్న అనారోగ్యానికి చెంచుపేటలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. సమయం ఆదా కావడం, రవాణా చార్జీల భారం తగ్గడంతో ప్రజలు సంతోషించారు.
శాశ్వత భవనాల నిర్మాణాలకు నాంది
ఆర్బన్ హెల్త్ సెంటర్లకు శాశ్వత భవనాల నిర్మాణానికి నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుంకట్టింది. ఒక్కో సెంటర్‌కు రూ.1.10 కోట్లు చొప్పున పట్టణంలోని ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లకు రూ.5.50 కోట్లను కేటాయించింది. పట్టణంలోని పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణం, అయితానగర్–నేలపాడు రోడ్డు, సుల్తానాబాద్‌లో నిర్మాణం పూర్తయింది. ప్రైవేటు భవనాల్లోంచి ఆయా కేంద్రాలను శాశ్వత భవనాల్లోకి మార్చారు. నాటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యవేక్షణలో ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా వైద్య కేంద్రాల్లో అందుతున్న వైద్యసేవలపై ప్రజల కూడా సంతృప్తిని వ్యక్తంచేశారు.
పనులు పెండింగ్
పట్టణంలో ఏర్పాటైన అయిదు అర్బన్ హెల్త్ సెంటర్లలో మూడింటికి శాశ్వత భవనాలు నిర్మాణం పూర్తయింది. చంద్రబాబునాయుడు కాలనీ, ఆలపాటినగర్‌లో తుదిదశలో ఉన్నాయి. అప్పట్లో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారటంతో ఆ పనులు పెండింగులో ఉండిపోయాయి.
● చెంచుపేట పరిధిలోని ఆలపాటినగర్‌లోని ఆరోగ్య కేంద్రం భవనం పనులు దాదాపు 90 శాతం పూర్తయింది. ఫ్లోరింగ్, ర్యాంప్, ఇతర చిన్న, చిన్న పనులు మాత్రమే నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.10లక్షల ఉంటుందని అధికారుల అంచనా.
● చంద్రబాబునాయుడు కాలనీలో గ్రౌండ్ ఫ్లోరింగ్, రంగులు, టాయిలెట్స్ నిర్మాణం వంటి రూ.20లక్షల పనులు పెండింగులో ఉండిపోయాయి.
ప్రైవేటు భవనాల్లో అవస్థలు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులు ఇప్పటికీ మొదలుపెట్టలేదు. భవనాలకు తాళాలు వేసి అధికారులు అలాగే ఉంచారు. వైద్య కేంద్రాలు ఇప్పటికీ ప్రైవేటు భవనాల్లో అరకొర వసతులోనే కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే పనులను పూర్తిచేసి ప్రజలకు సెంటర్లను అందుబాటులోకి తీసుకురావల్సిన ఆవశ్యకత ఉంది.
అర్బన్ హెల్త్ కేంద్రాల నిర్మాణం పూర్తికి చొరవ చూపని పాలకులు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.5.50 కోట్లతో ఐదు సెంటర్ల నిర్మాణం
పూర్తయి అందుబాటులోకి వచ్చిన మూడు కేంద్రాలు
మిగిలిన రెండు కేంద్రాల నిర్మాణం కూడా 90 శాతం పూర్తి
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ ఆరంభించని చివరి దశ పనులు
పెండింగ్ పనుల పూర్తికి సన్నాహాలు
పట్టణంలో చంద్రబాబు నాయుడు కాలనీ, ఆలపాటి నగర్‌లోని ఆర్బన్ హెల్త్ సెంటర్ భవనాలు చివరి దశలో ఉన్నాయి. మిగిలిన పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీటి గురించి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ నివేదిక అడిగారు. మంత్రి ఆదేశాలతో నిర్మాణ పనులను పూర్తిచేసి, ఆయా అర్బన్ హెల్త్ సెంటర్లను వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగిస్తాం.
– ఆకుల శ్రీనివాసరావు, ఇన్‌చార్జి మున్సిపల్ ఇంజినీర్, తెనాలి

కూటమి ప్రభుత్వ ‘మెడి’కిల్

కూటమి ప్రభుత్వ ‘మెడి’కిల్