
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా సేవలు
నరసరావుపేట: పల్నాడు జిల్లా ప్రభుత్వ హాస్పిటళ్ల పర్యవేక్షణాధికారి (డీసీహెచ్‌ఎస్)గా నియమితులైన డాక్టర్ ఎం.ప్రసూన శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ పి.అరుణ్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె నుంచి పుష్పగుచ్ఛం అందుకున్న కలెక్టర్.. శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్యకలాపాలన్నీ సక్రమంగా నడిచేలా చూడాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. డాక్టర్ ప్రసూన స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చర్మ వ్యాధుల డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన డాక్టర్ బీవీ రంగారావు గుంటూరు జిల్లాకు బదిలీ అయిన విషయం విదితమే. అప్పటి నుంచి పల్నాడుకు ఆయనే ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
క్రీడాసామగ్రి అందజేత
నరసరావుపేట: వేసవి క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యానికి దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. వేసవి సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న 50 ఉచిత శిక్షణ శిబిరాల ఇన్‌చార్జులకు శనివారం కలెక్టరేట్‌లో క్రీడా సామగ్రిని అందజేశారు. క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు జాతీయస్థాయి వరకు క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించేందుకు ఈ శిక్షణ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా క్రీడాధికార సంస్థ కోచ్ నరసింహారెడ్డి, క్యాంపు శిబిరాల ఇన్‌చార్జులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పచ్చదనం పెంపునకు చర్యలు
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర‘ కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం ‘బీట్ ద హీట్ ‘థీమ్‌తో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పాల్గొన్నారు. పచ్చదనంతోనే ఎండ నుంచి ఉపశమనం పొందేలా కలెక్టరేట్ కాంపౌండ్‌లో మొక్కలు నాటారు. చల్లదనాన్ని పెంపొందించే దిశగా చర్యలు చేపట్టారు. మొక్కలతో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా సేవలు