
పరిశుభ్రతతోనే ఆరోగ్యం
నరసరావుపేట: సిబ్బంది పని చేసే చోట పరిశుభ్రంగా ఉంచితే ఆరోగ్యం మెరుగవుతుందని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రతి మూడో శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి, ఆర్‌ఐలు గోపీనాథ్, కృష్ణ, యువరాజ్, పోలీస్ సిబ్బందితో కలిసి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కోరారు. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసుస్టేషన్లలో శ్రమదాన కార్యక్రమాలు జరిగాయి. పిచ్చి మొక్కలు, చెత్త, వ్యర్థాలను తొలగించి, ప్రజలకు శుభ్రతపై అవగాహన పెంచారు.