
జులై 5న జాతీయ లోక్ అదాలత్
నరసరావుపేటటౌన్: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జులై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 13వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్.సత్యశ్రీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులతోపాటు సివిల్, రెవెన్యూ, మోటర్ వాహన ప్రమాదాలు, చెల్లని చెక్కు, మనోవర్తి, కుటుంబ తగాదాలు, ముందస్తు వ్యాజ్యపు కేసులు పరిష్కరించబడతాయన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకొని విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని కోరారు. సివిల్ కేసులను లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నట్లైతే ఫీజు వాపస్ చేస్తారని తెలిపారు.
జెడ్పీలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, పరిపాలనాధికారులు, ఉద్యోగులు కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో శనివారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బీట్ ది హీట్ నినాదంతో పరిసరాలను పరిశుభ్రం చేసినట్లు చెప్పారు. వేసవిలో ఎండల తీవ్రత, వడగాలలు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.
వివాదాస్పదంగా మారిన ఫ్లెక్సీ
తెనాలిఅర్బన్: స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి మున్సిపల్ మార్కెట్‌లో శనివారం మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసి ఫ్లెక్సీ వివాదస్పదంగా మారింది. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో పలువురు జనసేన పార్టీ నాయకులు కమిషనర్ బండి శేషన్నను ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదంటూ ఆయనను హెచ్చరించారు.
నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్
● గుంటూరు, పల్నాడు జిల్లాలో
ఎనిమిది పరీక్ష కేంద్రాలు
● ఉదయం, మధ్యాహ్నం
రెండు విడతలుగా పరీక్షలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్–2025 ఆన్‌లైన్ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. గత జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండు సెషన్లలో జరిగిన మెయిన్స్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆదివారం జరగనున్న అడ్వాన్స్‌డ్‌కు హాజరు కానున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఎనిమిది పరీక్ష కేంద్రాల పరిధిలో ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ)లు జరగనున్నాయి. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులో పొందుపర్చిన నియమ, నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంది.
పలు రైళ్లు రద్దు
లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు డివిజన్ పరిధిలో గ్రూప్–డీ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లు రద్దు చేసినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ–గుంటూరు (57201), గుంటూరు–మాచర్ల(57203), మాచర్ల–నడికుడి(57206), నడికుడి–మాచర్ల(57205), మాచర్ల–గుంటూరు(57204), గుంటూరు– విజయవాడ(57202) రైళ్లు ఈనెల 17, 18 తేదీల్లో రద్దు చేసినట్లు వెల్లడించారు. కాచిగూడ–నడికుడి(67779), నడికుడి–కాచిగూడ(67780) రైలు ఈనెల 18, 19 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. రైలు ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.

జులై 5న జాతీయ లోక్ అదాలత్