
పవర్ లిఫ్టర్ షానూన్‌కు సత్కారం
తెనాలి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగిన ఆసియన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సహా నాలుగు పతకాలు సాధించిన మదిర షానూన్‌ను బుధవారం స్థానిక కేవీఐకే జిమ్‌లో సత్కరించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, డబుల్‌హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్‌శ్యాంప్రసాద్ హాజరయ్యారు. షానూన్‌ను సత్కరించారు. ఆమె విజయాలు క్రీడాలోకానికి స్ఫూర్తినిచ్చేవని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. జిమ్ శిక్షకురాలు, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి మాట్లాడుతూ తెనాలికి చెందిన షానూన్ కేఎల్ యూనివర్సిటీలో బీఐఏఎస్ డిగ్రీ చదువుతూ, తెనాలి కేవీఐకే జిమ్‌లో సాధన చేస్తోందని చెప్పారు. రాష్ట్ర, జాతీయస్థాయి పతకాలను సాధించిన తర్వాత తొలిసారిగా ఆసియా స్థాయి పోటీల్లో జూనియర్స్ విభాగంలో 47 కిలోల కేటగిరీలో పోటీ పడిందని తెలిపారు. రజత, మూడు కాంస్య పతకాలను సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. కేవీఐకే స్పోర్ట్స్ అకాడెమీకి తొలి అంతర్జాతీయ పతకాన్ని అందించినట్టు తెలిపారు. అకాడమీ తరఫున కొమ్మినేని భార్గవ్‌కుమార్, కోచ్ పూసపాటి శివరామకిరణ్‌రాజు, ఇతర లిఫ్టర్లు షానూన్‌ను సత్కరించారు.