
వైఎస్సార్ సీపీ పోరాటాలతోనే ఆర్‌ఓబీ పనులు
● సీఎం పేషీ నుంచి అక్షింతలతో కదిలిన కూటమి నేతలు ● అభివృద్ధి పనులపై ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతాం ● మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
పిడుగురాళ్ల: ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ చేసిన పోరాటాలతోనే కూటమి ప్రభుత్వం దిగి వచ్చి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనులను మొదలు పెట్టిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... జానపాడు–పిడుగురాళ్ల గ్రామాల మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మాణానికి 2022లోనే రూ. 52 కోట్లను మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి మంజూరు చేయించటం జరిగిందన్నారు. అనంతరం టెండర్లు పిలిచి, ఆక్రమణలను తొలగించటం, విద్యుత్ దీపాలను కూడా తొలగించటం జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతున్నా ఆ పనులు అంగుళం కూడా ముందుకు కదల్లేదన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రెండు, మూడు నెలల నుంచి ఉద్యమం మొదలు పెట్టామని, హైకో ర్టులో సైతం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసేందుకు సిద్ధమవుతున్నామని తెలుసుకున్న సీఎం పేషీ అధికారులు స్థానిక టీడీపీ నేతలకు అక్షింతలు వేయడంతో ఈ నెల 15వ తేదీన మళ్లీ శంకుస్థాపన చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. పదిసార్లు శంకుస్థాపన చేసినా వైఎస్సార్ సీపీ ఎప్పుడు అడ్డుకోదని, మేం నాటిన విత్తనం వృక్షమవ్వాలి, ప్రజలకు ఫలాలు అందివ్వాలని ఆయన అన్నారు.
ట్రాఫిక్ సమస్యకు చెక్
రైల్వే బ్రిడ్జితో జానపాడు గ్రామ రూపురేఖలు కూడా మారతాయని, పిడుగురాళ్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుందన్నారు. పనులు వేగవంతమవ్వాలని, వచ్చే సంవత్సరంన్నర, రెండు సంవత్సరాలలో పనులు పూర్తయ్యేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుందన్నారు. పిడుగురాళ్ల పట్టణానికి మంచి పార్కు కావాలని.. చెరువు అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయించామని, చెరువు ఆక్రమణలకు గురికాకూడదనే ఉద్దేశంతో చుట్టూ ప్రహరీ సైతం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఇప్పుడు దానిని కూడా ముందుకు తీసుకొని వెళ్తామని కూటమి ప్రభుత్వం చెబుతుందని.. ఆ నిర్ణయాన్ని సైతం స్వాగతిస్తామన్నారు. ఈ పనులన్ని పూర్తి అయ్యేంత వరకు ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు.