
నరసరావుపేటలో ‘సింగిల్’ బృందం సందడి
నరసరావుపేట ఈస్ట్: మండే వేసవిలో చల్లదనాన్ని అందించి హాయి గొలిపేలా సింగిల్ సినిమా ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందని ఆ సినిమా హీరో శ్రీవిష్ణు తెలిపారు. సింగిల్ సినిమా విజయ యాత్రలో భాగంగా బుధవారం చిత్ర యూనిట్ పల్నాడుజిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సందడి చేసింది. సినిమాను ప్రదర్శిస్తున్న కాసు మాల్‌లోని గీతా మల్టీప్లెక్స్‌లో థియేటర్‌లో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా, దర్శకుడు కార్తీక్ రాజులు సందడి చేసారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని కుటుంబ సమేతంగా సినిమాను చూసేలా కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కార్తీక్ రాజు ప్రేక్షకులకు అందించారని తెలిపారు. తనకు తాను తన జీవితాన్ని మలచుకునేలా, తనకు నచ్చిన రీతిలో జీవితంలో ఎదగాలని సూచించేలా సినిమా నిర్మించినట్టు తెలిపారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమా చేయటం, అది బ్లాక్‌బస్టర్ కావటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ, సింగిల్ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్విస్తుందన్నారు. హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో తాము నటించిన సింగిల్ విజయవంతం కావటం ఆనందంగా ఉందన్నారు.