
చట్ట వ్యతిరేకంగా పోలీసుల ప్రవర్తన
తాడికొండ: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. తాడికొండ మండలం కంతేరు ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పన, ఇతరులను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసిన నేపథ్యంలో బాధితులను నియోజకవర్గ ఇన్‌చార్జి డైమండ్ బాబు, పలువురు ఇన్‌చార్జిలతో కలిసి రాంబాబు మంగళవారం కంతేరు గ్రామంలో పర్యటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన కాకుండా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం దుర్మార్గమని అన్నారు. భారతీయ మహిళ, ప్రజాప్రతినిధిగా ఉన్న కంతేరు వలపర్ల కల్పన, మహాలక్ష్మీ, కర్రి విజయభాస్కర్, నితిన్‌లను అక్రమంగా అర్ధరాత్రి 3.30 గంటలకు అరెస్టు చేయడం సుప్రీం మార్గదర్శకాలకు వ్యతిరేకమన్నారు. కోర్టులో మాత్రం ఉదయం అరెస్టు చేశామని చెప్పడం న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించడమే కాకుండా న్యాయస్థానానికి అసత్యాలు చెప్పే స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని అన్నారు. చిన్న పిల్లల తగాదాకు రాజకీయ రంగు పులిమి ఎంపీటీసీని జైల్లో పెట్టడం దుర్మార్గం అన్నారు. బాధితులు దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిపై మాత్రం చర్యలు తీసుకోపోవడం పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. ఈ విషయం కోర్టు వారికి తెలియజేయగా కోర్టు వారు మెమో జారీ చేశారని, జిల్లా ఎస్పీకి బాధితులను తీసుకెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. చిలకలూరిపేట మాజీ మంత్రి రజినిని నెట్టివేసి ఆమె కారులో ఉన్న శ్రీకాంత్‌రెడ్డిని చొక్కా పట్టుకొని తీసుకురావడం ఏంటి అని ప్రశ్నించారు. చివరకు ఆ కేసులో చిన్న నోటీసు ఇచ్చి పంపించారని అన్నారు. డీజీపీకి చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, హోంమంత్రికి చెప్పినా ఉపయోగం లేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధితులను కలసి భరోసా ఇచ్చేందుకు వచ్చామని ధైర్యంగా ఉండాలన్నారు.
వైఎస్సార్‌సీపీలో కొనసాగుతుండటమే పాపమా!
కూటమి నాయకులు భయపెట్టి బెదిరింపులకు గురిచేసినా వైఎస్సార్‌సీపీలో కొనసాగుతుండడమే పాపమా అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఇక్కడ కొట్టింది ఓసీలు అరెస్టు చేసింది ఎస్సీలను అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అర్ధమవుతుందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో దీనిపై పార్టీ పోరాడి వారిని దోషులుగా నిలబెడతామన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు (డైమండ్) మాట్లాడుతూ తాము గ్రామీణ వాతావరణం గొడవలు లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతో తాపత్రయపడుతుంటే కులాల మధ్య చిచ్చుపెట్టే తీరును వైఎస్సార్ సీపీ ఖండిస్తుందని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎంపీటీసీ బోడపాటి సుశీల, మాజీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి, బొమ్మిరెడ్డి అశోక్‌రెడ్డి, ఫిరంగిపురం మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, బద్దూరి శ్రీనివాసరెడ్డి, చుండు వెంకటరెడ్డి, బాకి వెంకటస్వామి, బోడపాటి ధర్మరాజు, గుంటి రఘువరన్, కొప్పుల శేషగిరిరావు, అరేపల్లి జోజి, బెజ్జం రాంబాబు, పుట్టి సుబ్బారావు, నేలపాటి నాగేంద్ర, కొయ్యగూర వినోద్ తదితరులు పాల్గొన్నారు.
మహిళను అర్ధరాత్రి అరెస్టు చేయడం సుప్రీం మార్గదర్శకాలకు వ్యతిరేకం వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు