
జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోండి
వాల్‌పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్, అధికారులు
నరసరావుపేట: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చిలకలూరిపేటరోడ్డు బైపాస్ జంక్షన్‌లోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఈనెల 21వ తేదీన నిర్వహించే జాబ్‌మేళాను నియోజకవర్గంలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. టెక్ మహీంద్ర, టెక్నో టాస్క్ బిజినెస్ సొల్యూషన్, మాస్టర్ మైండ్స్, గోదావరి ఆంధ్ర కార్పొరేటివ్ బ్యాంక్, ఆపెక్స్ సొల్యూషన్స్, వి చేంజ్ సొల్యూషన్స్, అక్రో సాఫ్ట్ సొల్యుషన్స్, హెటిరో డ్రగ్స్ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయన్నారు. విద్యార్హతను బట్టి జీతం రూ.10వేలు నుంచి రూ.40వేలు వరకు ఉంటుందన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ చదువుకున్న 18–45 ఏడాది మధ్య వయస్సుగల నిరుద్యోగులు వారి రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, జిరాక్స్, ఆధార్ నకలు, పాస్‌పోర్ట్ ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఎం.వీరాంజనేయులు: 9160200652, జె.సురేష్: 9100566581, ఎ.రమ్య: 7702921219లను సంప్రదించాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావు పాల్గొన్నారు.
నులకపేటలో కారు బీభత్సం
పలు వాహనాలను ఢీకొట్టిన వైనం.. ఇద్దరికి గాయాలు
తాడేపల్లి రూరల్: మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై నులకపేట వద్ద ఓ కారు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం నులకపేట వినాయకుడి గుడి వద్ద మంగళగిరి నుంచి వస్తున్న కారు ఎదురుగా వెళుతున్న ఆటోను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని, సోడా బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిని ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రోడ్డు పక్కనే ఉన్న సోడా బండి, ద్విచక్రవాహనం దెబ్బతిన్నాయి. ఢీకొట్టిన కారు యజమాని పరారవుతుండగా స్థానిక యువకులు వెంబడించి నులకపేట సెంటర్‌లో అడ్డుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న యువకుడు గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళతాను, దెబ్బతిన్న వాహనాలను బాగు చేయిస్తానని మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. జరిగిన ఈ సంఘటనపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేసి బాధితుల దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు.

జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోండి