
జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణతో పాటు భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, పరిపాలన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెనీ క్రిస్టినా మాట్లాడుతూ అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు, జెడ్పీకి రావాల్సిన ఆదాయం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, రేవుల వేలం, షాపింగ్ కాంప్లెక్స్‌ల నుంచి రావాల్సిన బకాయిలపై మండలాల వారీగా వివరాలు సేకరించారు. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న కల్యాణ మండపాలు, దుకాణాల నుంచి అద్దెలు, లీజు బకాయిలను వసూలు చేయాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు జెడ్పీకి రావాల్సిన ఆదాయ వనరులు, బకాయిలకు సంబంధించి మండలాల వారీగా సమీక్షించారు. డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ ప్రతినెలా ఇవ్వాల్సిన నివేదిక వివరాలను క్రమం తప్పకుండా పంపాలని సూచించారు. వార్షిక అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్, పెండింగ్‌లో ఉన్న బకాయిలు, న్యాయస్థానాల్లో ఉన్న కేసుల వివరాలను సేకరించారు. వివిధ అంశాలపై పరిపాలనాధికారులు పూర్ణచంద్రారెడ్డి, శోభారాణి, తోట ఉషాదేవి నివేదిక సమర్పించారు. సమావేశంలో అకౌంట్స్ అధికారి శామ్యూల్‌పాల్, ఎంపీడీఓలు, ఏఓలు పాల్గొన్నారు.