
సిండికేటై మమ్మల్ని బలి చేశారు
● గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన నల్లబర్లీ పొగాకు రైతులు ● కంపెనీలు లేదా ప్రభుత్వమే కొనాలని డిమాండ్
యడ్లపాడు: యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్లబర్లీ పొగాకు రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. నల్లమడ రైతుసంఘం నాయకుడు డాక్టర్ కొల్లా రాజమోహన్‌రావు నేతృత్వంలో రైతు సంఘం నాయకుడు కల్లూరి రామారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో పలు రైతుసంఘాలు నాయకులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పొగాకు సాగు రైతులు సమష్టిగా పాల్గొని తమ గోడును అధికారులకు, వివిధ సంఘాల నాయకులకు వినిపించారు. రైతుసంఘం నాయకుడు నూతలపాటి కాళిదాసు మాట్లాడుతూ గతేడాది నల్లబర్లీ పొగాకును క్వింటాల్ రూ.18 వేల వరకు కొనుగోలు చేసిన కంపెనీలు, ఇప్పుడు అంతా సిండికేటై కేవలం రూ.4వేలు– రూ.5వేలకు ధరను దిగజార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పొగాకు రైతుల సమస్యను పరిష్కరించకుండా, కార్పొరేట్ సంస్థలకే మేలు జరిగేలా ప్రభుత్వం వ్యవహరించడంపై నిరసిస్తూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అనంతరం నాయకులతో కలిసి రైతులు డీటీ అనురాధకు వినతి పత్రాన్ని అందించారు.