
బంగారం ఆభరణాలు చోరీ
పిడుగురాళ్ల: బ్యాంక్ నుంచి బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్తుండగా ఆటోలో మాయమైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ, పిడుగురాళ్ల పట్టణంలోని తమ్ముడు యడ్లవల్లి పుల్లారావు సహాయంలో పట్టణంలోని చైతన్య గోదావరి బ్యాంక్ లాకర్‌లో ఉన్న నగలను తీసుకుంది. పిడుగురాళ్ల పట్టణంలోని చెన్నాయపాలెం వెళ్లే ఆటో వద్దకు వెళ్లారు. ఊరు వెళ్తుండగా వీరితో పాటు మరికొంత మంది ఆటో ఎక్కి బ్రాహ్మణపల్లి సమీపంలో దిగారు. వారు దిగి వెళ్లిన తరువాత బ్యాగ్ చెక్ చేసుకోగా నగలు కనిపించలేదు. దీంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగల బాక్స్‌లో నక్లెస్, లాకెట్, చంద్రహారం, లాకెట్, నానుతాడు, ఐదు వరసల ఉంగరాల చంద్రహారం మొత్తం 170 గ్రాములు ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ ఐదు గ్రామాలలో మట్టి తవ్వకాలు చేస్తే చర్యలు
అమరావతి: మండల పరిధిలోని పెదమద్దూరు, వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలలో రాజధాని నగర నిర్మాణం కోసం లాండ్ పూలింగ్ ప్రక్రియలో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ డానియేల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గ్రామాలలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా గ్రామాల వీఆర్‌వోలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
గుంటూరు రూరల్: భర్త వేధింపులు భరించలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆమె మృతదేహాన్ని పలు నాటకీయ పరిణామాల మధ్య అంబులెన్స్‌లో గుంటూరు శివారు ఓబులనాయుడుపాలేనికి తరలించడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులు, నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం... ప్రత్తిపాడు మండల యనమదల గ్రామానికి చెందిన హేమలతకు 2020లో ఓబులనాయుడుపాలెం గ్రామానికి చెందిన మురళీతో కులాంతర వివాహం జరిగింది. హేమలత హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. పెళ్లి అనంతరం కాపురాన్ని హైదరాబాద్ లింగంపల్లి ప్రాంతానికి మార్చారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త మురళి జులాయిగా తిరుగుతూ, బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. డబ్బులు కోసం నిత్యం భార్యను వేధింపులకు గురిచేస్తూ ఉండేవాడు. చేసేదిలేక హేమలత తన శక్తికి మించి రుణాలు చేసి అడిగిన మొత్తం సర్దుబాటు చేసేది. ఇటీవల భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. ఆదివారం భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు. హేమలత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు చెప్పకుండా భర్త ఆమె మృతదేహాన్ని నేరుగా అంబులెన్స్‌లో ఓబులనాయుడుపాలేనికి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న హేమలత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వంశీధర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీరో ఎఫ్‌ఐర్ చేసి కేసును హైదరాబాద్ చందానగర్ స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విలువ సుమారు రూ.17 లక్షలు ఆటోలో వెళ్తుండగా మాయం