
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిలిపివేయాలి
నరసరావుపేట: పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న పాఠశాలల పునవ్యవస్థీకరణ ప్రక్రియతో పాటు ఏ విధమైన స్పష్టమైన జీఓలు లేకుండా రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరెడ్డి, ఎం.మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏఓకు వినతిపత్రం సమర్పించారు. తొలుత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఓ 117 రద్దు చేసి దాని స్థానంలో కొత్త జీఓ విడుదల చేసి పాఠశాలలను పునవ్యవస్థీకరించాలని కోరారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని పేర్కొన్నారు. అన్నీ మోడల్, ప్రైమరీ పాఠశాలల్లో ఐదు తరగతులు బోధించడానికి ఐదుగురు ఉపాధ్యాయులను, విద్యార్థుల సంఖ్య 120కి మించితే ఆరుగురు ఎస్‌జీటీలను, ఆ పైన ప్రతి 30 మందికి ఒక ఎస్‌జీటీ చొప్పున కేటాయించాలని అన్నారు. అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించి వారిని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మాత్రమే నియమించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియాన్ని కొనసాగించాని, తరగతిలో విద్యార్థులు 45 మించితే రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలని సూచించారు. హైస్కూలులో విద్యార్థుల సంఖ్య 300 దాటితే అదనపు పీడీ పోస్టు కేటాయించాలని కోరారు. బదిలీల జీఓ విడుదల చేసి వేసవి సెలవులలో ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. ఎస్.జి.టి.లకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపట్టాలన్నారు. జిల్లాలో సీనియారిటీ సమస్యలు పరిష్కరించిన తర్వాతనే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, బదిలీలు, పదోన్నతులు ప్రక్రియలు వేర్వేరుగా నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ ఖాసీం పీరా, సహఅధ్యక్షులు ఏ బాగేశ్వరిదేవి, జేవీడీ నాయక్, కోశాధికారి ఎం.రవిబాబు, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్, జిల్లా ఇన్‌చార్జి టీఎస్‌ఎన్ మల్లీశ్వరరావు, జిల్లా కార్యదర్శిలు ఉషాశౌరి రాణి, టి.వెంకట్, కె.తిరుపతిస్వామి, ఆర్.నాసర్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ ధర్నా