బ్లాక్‌ బర్లీ.. రైతులకు వర్రీ | - | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ బర్లీ.. రైతులకు వర్రీ

May 12 2025 1:01 AM | Updated on May 12 2025 1:01 AM

బ్లాక

బ్లాక్‌ బర్లీ.. రైతులకు వర్రీ

కూటమి పాలనలో మద్దతు ధర దక్కక కన్నీరు

యడ్లపాడు: గతేడాది సిరులు పండించిన బ్లాక్‌ బర్లీ పొగాకు ఈ ఏడాది రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదు. మార్కెట్‌ ధరలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తుపాను, తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడి దిగుబడి సాధించినా ప్రయోజనం లేకుండాపోతోంది. గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు చెందుతున్నారు. గతేడాది పొగాకును పోటీ పడి కొనుగోలు చేసిన కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేశాయి. సీలింగ్‌, సిండికేట్‌ చేస్తూ కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. కొందరు రైతులు పండించిన పొగాకును భద్రపరుచుకునేందుకు అవకాశం లేక పొలాల్లోనే ఉంచుకునే దుస్థితి నెలకొంది. మద్దతు ధర కొరవడటంతోపాటు కంపెనీలు, వ్యాపారులు ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తూ మోసం చేస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించడం లేదు. అధికారులు కూడా నాణ్యత పేరు చెప్పి తప్పించుకుంటున్నారు.

ఐదు వేల ఎకరాల్లో సాగు

గత ఏడాది పొగాకు ధరలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అప్పట్లో మొక్కకున్న చివరి ఆకు సైతం రైతులు విక్రయించారు. మార్కెట్‌లో మంచి ధర లభించడంతో ఒక్కో ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు మిగిలిన రైతులు కూడా ఉన్నారు. దీంతో కొన్నేళ్లుగా సాగు చేస్తున్న సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందనే ఆశతో ఈ ఏడాది అధిక మొత్తంలో రైతులు పొగాకు వైపు మొగ్గు చూపారు. బ్లాక్‌ బర్లీ ఈ ఏడాది నియోజకవర్గంలో సుమారు 5 వేల ఎకరాల్లో సాగైంది. పెట్టుబడి తక్కువే అయినా ఈ ఏడాది కూలీల ధరలు అమాంతంగా పెరగడంతో ఊహించని విధంగా రైతులపై అదనపు భారం పండింది.

కొనే దిక్కు లేదు..

గతంతో పోలిస్తే సాగు ఖర్చు రెట్టింపు అయింది. పెట్టుబడి ఖర్చులు పెరిగినా రైతులు వెనుకాడకుండా బోర్లు, బావుల కింద పంట సాగు చేశారు. గతేడాది ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది వర్షాలు, తెగుళ్లకు కొంతమేర దెబ్బతిన్నా తర్వాత తేరుకున్నారు. ఏటా ఒక్కో కూలీకి రోజుకు రూ.250 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.400కు చేరింది. ప్రారంభంలో క్వింటాకు రూ.18 వేలు ఇస్తామన్న కంపెనీలు దిగుబడి సాకు చూపి రూ.15,500కు తగ్గించేశాయి. అదైనా ఇస్తున్నారా అంటే.. పురుగు మందులు, ప్లాస్టిక్‌ అవశేషాలు లేకుండా ఆరిన ఆకుకు మాత్రమే ఆ ధర ఇస్తామంటూ సంస్థల ప్రతినిధులు సాకులు చెబుతున్నారు. ఇలా తేమ ఉందని, ఆకు విరిగిందని, నాణ్యత లేదంటూ రకరకాల కారణాలతో ధరను ఏకపక్షంగా తగ్గిస్తున్నారు. ప్రస్తుతం ధరలు పరిశీలిస్తే అడుగు ఆకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు, నాణ్యత గల ఆకు క్వింటా రూ.8 వేల వరకు చొప్పున వ్యాపారులు కొంటున్నారు. తొలితీత ఆకుకు క్వింటా రూ.12 నుంచి రూ.13 వేల వరకు ధర లభిస్తోందని రైతులు వాపోతున్నారు. పొలాల్లోని పందిళ్లలో, పశువుల పాకల్లో పంటను భద్రపరుచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎక్కువకాలం ఇలానే ఉంటే నాణ్యత దెబ్బతిని మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్‌ బర్లీ పొగాకు రైతులు మద్దతు ధర కోరుతూ ఎక్కడికి వెళ్లినా నిరాశే మిగులుతోంది. అటు కూటమి ప్రభుత్వ పాలకులు... ఇటు అధికారులు కనీస దయ చూపకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే అదనుగా దళారులు అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు.

నాణ్యతకే ప్రాధాన్యం అంటూ అధికారుల సాకులు సిండికేట్‌గా మారి క్వింటా రూ.8 వేలకే కొట్టేస్తున్న కంపెనీలు, వ్యాపారులు నల్ల బర్లీ సాగు చేసిన అన్నదాతలకు తప్పని తీవ్ర నష్టాలు సమస్య గుర్తించామంటూనే పరిష్కారం చూపని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూనేడు యడ్లపాడులో రైతుల ధర్నా

గళం వినిపించేందుకు

తమ గోడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే సంకల్పంతో బర్లీ రైతులు సోమవారం ఉదయం 10 గంటలకు యడ్లపాడు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు. నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌రావు నేతృత్వంలో జరిగే ఈ ధర్నాలో నియోజకవర్గంలోని పొగాకు రైతులందరూ పాల్గొననున్నారు. బర్లీ పొగాకును వెంటనే కంపెనీలు కొనుగోలు చేయాలని, వ్యవసాయ మంత్రి సమక్షంలో కంపెనీలు అంగీకరించిన విధంగా క్వింటా రూ.15 వేలకు తక్కువ కాకుండా ఇవ్వాలని, కంపెనీలు న్యాయమైన ధర ఇవ్వకపోతే మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. బర్లీ రకాన్ని పొగాకు బోర్డు పరిధిలోకి చేర్చాలనే డిమాండ్‌ ఊపందుకుంది. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం అందించనున్నారు.

బ్లాక్‌ బర్లీ.. రైతులకు వర్రీ1
1/1

బ్లాక్‌ బర్లీ.. రైతులకు వర్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement