
ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి
చిలకలూరిపేట: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె. కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు ఉండే విధంగా, 120 రోల్ దాటిన ప్రతి పాఠశాలకు ఒక పీఎస్ హెచ్‌ఎం, ఐదుగురు టీచర్లు ఉండే విధంగా బదిలీలు నిర్వహించాలని కోరారు. పట్టణ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ స్కూల్స్ పర్యవేక్షణకు అర్బన్ ఎంఈవోను నియమించాలని విజ్ఞపి చేశారు. సమావేశంలో సంఘ నాయకులు వినుకొండ అక్కయ్య, మేకల కోటేశ్వరరావు, వి. జయప్రకాశ్, మగ్బుల్ బాషా, దుర్గాప్రసాద్, షేక్ మస్తాన్‌వలి, ఎం. శారద, తదితరులు పాల్గొన్నారు.